Andhra PradeshHome Page Slider

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్, సిఐడి కస్టడీ పిటిషన్లపై విచారణ గురువారానికి వాయిదా పడింది. విజయవాడ ఎసిబి కోర్టులో బుధవారం ఆయా పిటీషన్లపై విచారణ జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అటు సిఐడి, ఇటు చంద్రబాబు తరపు న్యాయవాదులు హోరాహోరీగా సుదీర్ఘ వాదనలు వినిపించారు. మధ్యాహ్నం భోజనం అనంతరం ప్రారంభమైన విచారణలో సిఐడి వాదనలు వినిపించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబును సిఐడి గత నెల తొమ్మిదో తేదీన అరెస్ట్ చేసింది. అప్పటినుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఆయన రిమాండ్ లో ఉంటున్నారు. ఈ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు తరఫున విజయవాడ ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు చంద్రబాబును మరింత విచారించాల్సి ఉన్నందున రెండో సారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిఐడి ఇదే కోర్టులో ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం కి విచారణ వాయిదా వేశారు.