NationalNews

పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు… ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

కొందరు నిబంధనలు పాటించకుండా `షార్ట్‌ కట్‌’ను అనుసరిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా వెళితే ప్రమాదం పొంచి ఉందని తెలిసి కూడా `షార్ట్‌ కట్‌’ ద్వారా వెళతారు. అలాంటిదే ఓ సంఘటన బిహార్‌లోని భాగల్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. కహల్‌గావ్‌ రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి ఒక ప్లాట్‌ఫాం నుండి మరొక ప్లాట్‌ఫాంకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ అతను ఫుట్‌ ఓవర్‌ వంతెన గుండా వెళ్ళడానికి బదులుగా షార్ట్‌ కట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆగి ఉన్న రైలు కింది నుంచి పట్టాలు దాటే యత్నం చేశాడు. అంతలోనే రైలు కదిలింది. అప్రమత్తమైన అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. రైలు వెళ్లే వరకు ఎటూ కదలకుండా అలాగే పడుకున్నాడు. రైలు వెళ్లిపోగానే దేవుడిని తలుచుకున్న ఆ వ్యక్తి  తన ప్రాణాలను ఆ దేవుడే కాపాడాడు అంటూ.. అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.