NationalNewsNews Alert

అవకాశవాద రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ నితీష్

Share with

అవకాశావాద రాజకీయాలకు ఆయన పెట్టింది పేరు. అధికారం కోసం ఆరాటం.. సీఎం పదవి కోసం పోరాటం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఏదైనా కానీ.. తనపై ఎవరు ఎలాంటి ముద్ర వేసినా కానీ.. అనుకున్నది సాధించుకోవడంలో దేనికీ వెనుకాడడు. బీహార్ రాజకీయాలను అవపోసన పట్టిన నితీష్ అవకాశవాద రాజకీయాలు నెరపడంలో ముందువరుసలో నిలుస్తాడు. బీహార్‌లో ఎన్ని రాజకీయ పార్టీలు అయితే ఉన్నాయో అన్నింటితో జట్టు కట్టిన నేతగా నితీష్ కుమార్ కు పేరు. అధికారం కోసం ఆయన పడే ఆరాటం అంతా ఇంతా కాదు. అన్నీ అవకాశవాద రాజకీయాలే. పవర్ పాలిటిక్స్ నడపడంలో ఆయన్ను మించిన వారు లేరు. నిన్న మొన్నటి వరకు బీజేపీతో జట్టు కట్టు ఎన్.డి.ఏలో కొనసాగారు. తన పార్టీ జేడీయూకి సరైన సంఖ్యాబలం లేకపోయినా గద్దెనెక్కి పాలన సాగించారు. అతి తక్కువ స్ధానాల్లో విజయం సాధించినప్పటికీ నితీష్ కే పాలన పగ్గాలు అప్పగించారు కమలనాధులు. కానీ.. అప్పటి నుండి ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు రాజుకున్నాయి. ఆధిపత్య పోరు సాగింది. తనదైన మార్క్ చూపించాలని భావించినా బీజేపీ ముందు నితీష్ కుప్పిగంతులు సాగలేదు.

మొదట్లో కొంతకాలం లాలూతో జత కట్టారు. తన మాటల మాయాజాలంతో ఆయన్ను కూడా మైమరపింపజేశాడు. ఆ తర్వాత బీజేపీతో పొట్టు పెట్టుకున్నారు. కొంత కాలానికి బయటకు వచ్చారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి మహాఘట్ బంధన్ ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ కూటమిపై ఆరోపణలు ఎక్కుపెట్టి 71 స్ధానాల్లో విజయం సాధించగా.. ఆర్జేడీ 80 సీట్లు గెలుచుకుంది. అయినా తానే ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ.. ఎక్కడో అనుమానం. ఆ బంధం ఎన్నాళ్ళు ఉంటుందా అని రాజకీయ పండితులంతా ఎదురు చూశారు. ఆ రోజు రానే వచ్చింది. కూటమి విచ్ఛిన్నం అయ్యింది. ఇప్పుడేం చేయాలి. మళ్ళీ ఆలోచనకు పదును పెట్టాడు. ఎన్.డి.ఏకి గాలం వేశాడు. అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వెళ్ళి ఎన్.డి.ఏ బుట్టలో పడ్డాడు. అంతే .. 2020 ఎన్నికల్లో 115 స్ధానాల్లో పోటీ చేస్తే కేవలం 45 నియోజకవర్గాల్లో మాత్రమే గెలుపొందారు.


విజయావకాశాలు ఉన్న 35 నియోజకవర్గాల్లో లోక్ జనశక్తి దెబ్బ కొట్టింది. అయినా నితీషే తిరిగి ముఖ్య మంత్రి అయ్యాడు. కానీ బీజేపీతో పొసగక బయటకొచ్చేశాడు. అయితే అంతకు ముందు నుండే కేద్రంతో పట్టీపట్టని ధోరణితో వ్యవహరిస్తూ రావడం.. కేంద్రం నిర్వహించిన అనేక సమావేశాలకు డుమ్మా కొట్టడంతో అనేక సంకేతాలు ఇచ్చినట్టయ్యింది. నిలకడ లేని ఇలాంటి పరిణామాలే ఆయనలోని అవకాశ వాది తెరపైకి తెస్తున్నాయి. పదవి కోసం సిద్దాంతాలను పక్కన పెట్టేస్తాడు. అధికారం కోసం ఎవరితో అయినా కలిసి పోతాడు. నిన్నటి వరకు తాను విమర్శించిన వారిని అదే నోటితో పొగిడి వారి తప్పులను కడిగేస్తాడు. వారంతటి వారు లేరని పొగడ్తలతో ముంచేస్తాడు. తాయిలాల ఎర చూపి లాగేస్తాడు. సీఎం పీఠం మీద మాత్రం తానే ఉండేట్లు చూసుకుంటాడు. ఇదీ నితీష్ రాజకీయ మంత్రాంగం. బీహార్ లో ఎప్పుడూ కుర్చీలాటలో ఆయన ఫస్ట్. ఆయనాటే బెస్ట్. అది అవకాశవాదం అనండి. లేదా ఇంకేదైనా అనండి. ఈసారి ఎవరికి వల వేస్తాడో.. ఎవరి పంచన ఉంటాడో ఆ దేవుడికి కూడా తెలియని ఆటలాడడంలో నితీష్ మించినోడు లేడన్నది జేడీయూలో అంతర్గతంగా వినిపించే మాట.