NewsTelangana

వరద భయంతో వణుకుతున్న గోదావరి ప్రాంత ప్రజలు

Share with

గోదావరి ఇప్పట్లో శాంతించేటట్లు కనిపించడం లేదు.అలానే తీర ప్రాంతాలలోని ప్రజలను కరుణించేటట్లు లేదు.ఇప్పటికే రెండుసార్లు వరదలతో జన జీవనాన్ని అస్తవ్యస్థం చేసిన గోదావరి మరోసారి ప్రజలపై విరుచుకు పడేలా కన్పిస్తోంది. దీంతో గోదావరి తీర ప్రాంత ప్రజలకు మళ్ళీ వరద భయం పట్టుకుంది. ఒకే నెలలో మూడోసారి వరద పెరుగుతుండడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం గరిష్ఠంగా 71.30 అడుగులకు చేరుకున్న విషయం తెలిసిందే. తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టిన వరద సోమవారం మధ్యహ్నం నాటికి 56.10 అడుగులకు చేరుకుని నిలకడగా ఉంది. అయితే తరువాత వరద 60 అడుగుల వరకు చేరడంతో అధికారులు ఎస్సారెస్సీ 26 గేట్లను తెరిచి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. అయితే భద్రాచలంలోని మన్యం ప్రాంతం గత వారం రోజులుగా జల దిగ్భందంలోనే ఉంది.

భద్రాచలం రామాలయం పరిసర ప్రాంతాలలోని ఇళ్ళన్నీ 4 రోజులుగా నీళ్ళల్లో నానుతూ ఉన్నాయి. కొన్ని ఇళ్ళ గోడలు బాగా నాని కూలిపోయే దశకు చేరుకున్నాయి. వరద నీరు ఇండ్లలోనికి ప్రవేశించడంతో సరుకులు అన్ని పాడైపోయాయి.ఇంట్లోని ఫర్నిచర్, బీరువాలు అన్ని దెబ్బతిన్నాయి. వందల కుటుంబాలు రోడ్డుపాలయ్యాయి. దాదాపు 4,779 మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు కూనవరం రోడ్డులోని సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ క్యాంపుఆఫీసు లోకి వరద నీరు చేరగా రూ.కోటి రూపాయల నష్టం వాటిల్లింది.ఆ క్యాంపు ఆఫీసులోని కమ్యూనికేషన్ పరికరాలు ,ముఖ్యమైన ఫైళ్లు నీటి పాలయ్యాయి. దుమ్ముగూడెం ,చర్ల తదితర మండలాల్లోని పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. అలాగే ఇండ్లలోని ఎరువులు, బియ్యం తడిసి ముద్దయ్యాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ వరద ఉధృతి పెరగుతుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.