ఎంపీ రఘురామపై హత్య యత్నం… చంద్రబాబు సంచలన ఆరోపణ
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం కోనసీమ , పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన ఆయన , వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల వద్దకు బురదలో నడుస్తూ వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గం దొడ్డిపట్లను పరామర్శించిన చంద్రబాబు , ఇక్కడ ప్రజలు ఇంత కష్ట పడుతుంటే సీఎం జగన్ నిమ్మకు నిరెత్తినట్టు ఏమీ పట్టించుకొకుండా.. తాడేపల్లి ప్యాలస్‌లో ఉన్నారని ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాలపై, పేదవాడి కష్టాలపై సీఎం జగన్ కు బాధ్యత లేనట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజల్ని బురదలో ముంచి సీఎం మాత్రం గాల్లో తిరిగితే సమస్యలు ఏలా పరిష్కారమౌతాయన్నారు. మానవత్వం లేని మనిషికి సీఎంగా ఉండే అర్హత ఉందా..అని ప్రశ్నించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి సకాలంలో ఇసుక బస్తాలు వేయడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో తుఫానులు , వరదలు వంటి పరిస్దితులు ఏర్పడినప్పుడు తక్షణమే స్పందించి ప్రభుత్వ యాత్రంగాన్ని అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టానని గుర్తుచేశారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాకా ఇటువంటి వాటి గురించి అసలు పట్టించుకొకుండా ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఈ విధంగా ఎంత మందిని జైల్లో పెడతారని నిలదీశారు. ఎంపీ రాఘురామకృష్ణరాజును తన సొంత ప్రాంతానికి రాకుండా చేసి… ఆయనపై హత్యయత్నం చేసారని ఆరోపించారు. జగన్ తన సొంత బాబాయినే చంపి ఆ నేరాన్ని తనకు అంటగట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ తరహాలోనే రాఘరామను కూడా చంపి ఆ నేరం వేరే వారిపై వేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.