దూకుడు పెంచిన జగన్ !
◆ 2024లో అధికారమే లక్ష్యంగా అడుగులు
◆ కష్టపడితేనే టికెట్లు ఇస్తానని హుకుం
◆ జాగ్రత్త పడండంటూ ఎమ్మెల్యేలకు క్లాస్
◆ 175/175 అసెంబ్లీ సీట్లు గెలుపే ధ్యేయంగా జగన్ వైఖరి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుందా అన్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి కనపడుతోంది. ఆయన చేసే ప్రతి పని… వేసే ప్రతి అడుగు ముందస్తు ఎన్నికలకు సంకేతాలుగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు నిరంతరం ప్రజల్లోనే ఉండాలని వచ్చే ఎన్నికలు తమ పార్టీకి చాలా కీలకమని ఆయన పదేపదే చెబుతూనే ఉన్నారు. తాజాగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ పాల్గొనేందుకు అమరావతికి వచ్చిన మంత్రులు శాసనసభ్యులతో జిల్లాల వారీగా సమావేశమైన ఆయన ప్రతి ఒక్కరు పనితీరు పద్ధతి మార్చుకోవాలని లేదంటే చాలా కష్టమని ప్రజల్లో ఉన్న వారికే అవకాశాలు ఉంటాయని వారికే టికెట్లు కేటాయిస్తానని తెలిపారు. 175 నియోజకవర్గాల గెలిపే ధ్యేయంగా ఆయన అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ అనే నేను అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. 3,648 కిలో మీటర్ల పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామాం ప్రతి వర్గం ప్రజల్లో నమ్మకం కలిగించి… 51 శాతం ఓటింగ్ తో 151 సీట్లతో ఏపీ ముఖ్యమంత్రిగా సీఎం అయ్యారు. మూడేళ్ల పాలనలో ఎన్నో ఒడిదుడుకులు. కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీ అమలు దిశగానే సీఎం జగన్ అడుగులు వేసారు. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 90 శాతం మేర పూర్తి చేసామని పార్టీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల పాలన పూర్తయిన వేళ ప్లీనరీని కూడా విజయవంతంగా ఆ పార్టీ నిర్వహించింది. ఇక, ఇప్పుడు 2024 ఎన్నికల్లో తిరిగి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మూడేళ్ల పాలనలో అందించిన సంక్షేమం అమలు చేసిన సామాజిక న్యాయం అస్త్రాలుగా వచ్చే ఎన్నికలకు ఆయన సిద్దం అవుతున్నారు.
ఈసారి నిర్ణయాధికారం బీసీల దేనా ?
ఇక, సామాజిక న్యాయం దిశగా వేసిన అడుగులు ఇప్పుడు వర్గాల నుంచి వైసీపీకి అండ లభిస్తోంది. రానున్న ఎన్నికల్లో బీసీ కులాల ఓట్లు ఆయా పార్టీల గెలుపోటములు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ రాష్ట్రంలో 139 బీసీ కులాలకు 56 వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లను 2020 అక్టోబర్‌లోనే ఏర్పాటు చేశారు. ఆయా సామాజిక వర్గాల్లోని పేదలకు అండగా నిలిచి ఇబ్బందులను దూరం చేసేలా.. వారందరికీ ఆర్థిక, సామాజిక బలిమి చేకూరేలా సంబంధిత కార్పొరేషన్లను తీర్చిదిద్దారు.కార్పొరేషన్లను సామాజిక చైతన్య వేదికలుగా మలిచి రాష్ట్రంలో కొత్త చరిత్రకు సీఎం జగన్ నాంది పలికారు. వాస్తవానికి వెనుకబడిన తరగతుల్లో బయట ప్రపంచానికి పేర్లు సైతం తెలియని కులాలను కూడా గుర్తించారు.అత్యంత వెనుకబడిన, నిర్లక్ష్యానికి గురైన అనేక కులాలకు కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో కార్పొరేషన్‌కు ఒక చైర్మన్, 12 డైరెక్టర్లను నియమించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక రికార్డు. కార్పొరేషన్లు పేరుకు మాత్రమే కావడంతో.. బీసీలు ఇప్పుడు ఎటువైపు మొగ్గుతారన్న టెన్షన్ జగన్ ను వేధిస్తోంది. పేరుకు మాత్రమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి… ఆయా వర్గాలను వైసీపీ సర్కారు మోసం చేస్తోందన్న భావన ప్రజల్లోకి వెళ్తోంది. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ రెండూ కూడా బీసీలకు నిజమైన అధికారాన్ని ఇవ్వలేదన్న వర్షన్ వారిలో బలంగా పాతుకుపోయింది.
ఐతే జగన్ మాత్రం… బీసీలకు అన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తున్నామని చెబుతున్నారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొని తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే జగన్ ప్రణాళికలు అమలు చేస్తున్నారు. దీంతో. ఇక, ప్రతిపక్షాలు రాజకీయంగా ముందుకు కదులుతున్న వేల అటు ప్రభుత్వం ఇటు పార్టీ పరంగా సీఎం జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకోవటంతో పాటుగా ప్రజల్లోనే ఎక్కువగా ఉండేలా నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో జగన్ అనుకున్నది సాధిస్తారా లేదా అని వేచి చూడాల్సి ఉంది.