ప్రచార రథం రంగు పై రగడ.. ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార రథం పై రగడ మొదలైంది. ఆ వాహనానికి వినియోగించిన గ్రీన్ రంగు పై అధికార వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ట్విట్టర్ వేదికగా రంగు పై మొదలైన విమర్శలు రచ్చకు దారి తీస్తున్నాయి. వచ్చే ఎన్నికల కోసం సిద్ధం చేసుకున్న తన ప్రచార రథం వారాహిపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ముందుగా తన సినిమాలను అడ్డుకున్నారని, విశాఖ వెళ్లే హోటల్ గది నుంచి బయటికి రాకుండా నిరోధించారని, అక్కడ నుంచి బలవంతంగా పంపేశారని, మంగళగిరిలో తన కారులో వెళ్తుంటే అడ్డుకున్నారని, ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటే అడ్డుకున్నారని ఇప్పుడు వాహనం రంగు పైన వివాదం చేస్తున్నారని ఆగ్రహించారు.
కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా వేసుకోవచ్చా ఇకపై శ్వాస తీసుకోవడం ఆపేయమంటారా అని నిలదీశారు. ట్విట్టర్లో చెట్లు ఫోటోలు ట్వీట్ చేసి ఇందులో ఏ రంగు వేయాలని ప్రశ్నించారు. రూల్స్ ఒక్క పవన్ కళ్యాణ్ కోసమేనా అంటూ ఆలీవ్ కలర్ లో ఉన్న కారుల ఫోటోలను ట్విట్ చేశారు. దీనిపైన కూడా మాజీ మంత్రి పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. మిలటరీ వినియోగించే ఆలివ్ గ్రీన్ ను వేయకూడదని ఇది నిషేధిత రంగు అని అది పవన్ కళ్యాణ్ కు తెలియదా అని , సినిమాల్లో అయితే ఇలాంటి రంగులు వేసుకొని పెద్ద పెద్ద మిషన్ గన్నులు పట్టుకొని బోర్డర్లో పాకిస్తాన్ జవాన్లపై కాల్పులు జరిపేయేవచ్చని వాస్తవంలో అది కుదరదని వ్యాఖ్యానించారు. మాటిమాటికి తెలుపు రంగు మరొకటి మార్చుకోవటం కంటే ఏకంగా వారాహికి పసుపు రంగు వేసుకుంటే భవిష్యత్తులో పవన్ కు ఉపయోగపడుతుందని ఎద్దేవా చేశారు. దీనిపైన మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు శ్వాస తీసుకో పవన్ కళ్యాణ్ ప్యాకేజీ వద్దని ఘాటుగా వ్యాఖ్యానించారు.

