ఆర్మూర్ ఉగ్ర లింకులు… ఎన్ఐఎ అలర్ట్
ఇటీవల ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై భారత్‌లోని పలు రాష్ట్రాలలో వరుసగా కేసులు నమోదౌతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) ఈ కేసులపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగంగా దేశంలోని 8 రాష్ట్రాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ రాష్ట్రాలలో ఉన్న 13 ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది. మహరాష్ట్రలోని నాందేడ్, కొల్హాపూర్, గుజరాత్‌లోని భరుచ్, సూరత్, నవ్‌సారి, అహ్మదాబాద్‌లో సోదాలు చేసింది. అంతే కాకుండా కర్నాటక లోని భత్కల్, తుమ్‌కుర్, బీహార్‌లోని ఆరియా, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్, యూపీలోని దియోబంద్ జిల్లాలో సోదాలు చేపట్టింది. ఈ సోదాలలో భాగంగా కీలక డాక్యుమెంట్లు,వస్తువులను ఎన్‌ఐఎ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
తాజాగా ఆర్మూర్‌లో ఎన్ఐఏ దాడులతో కలకలం రేగింది. ఆర్మూర్‌కి చెందిన వ్యక్తికి… పాకిస్తాన్ నుండి వచ్చిన కాల్స్, బ్యాంక్ లావాదేవీలపై విచారణ సాగుతోంది. పాకిస్తాన్ నుండి నిధులు ఎలా వస్తున్నాయ్? అక్కడి నుండి ఎవరు ఫోన్ చేసారు? అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఉగ్ర సంబంధాలపై ఎన్ఐఏ టీమ్ ఆరా తీస్తోంది. మరో ఇద్దరిని జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో పోలీసులు విచారిస్తున్నారు.
ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఒక కేసును సుమోటోగా తీసుకున్న ఎన్ఐఎ అధికారులు జూన్ 25న పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి..ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. కర్ణాటకలో ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఉన్న భత్కల్‌కు చెందిన ఒక వ్యక్తిని ఎన్ఐఎ ఈ దాడుల్లో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.అయితే ఈ దాడుల్లో మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ స్పష్టం చేసింది.మరోపక్క తీవ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియా(పిఎఫ్ఐ)తో సంబంధం ఉందన్న ఆరోపణలతో బీహార్‌లోని నలంద జిల్లాలో కూడా ఎన్ఐఎ సోదాలు నిర్వహించింది. అదే విధంగా కేరళలోనూ సోదాలు నిర్వహించింది. ఈ మధ్యకాలంలో పోలీసులపై హత్యాయత్నం చేసిన సతిక్‌బచ్చాకు సంబంధించిన కేసులో ఈ దాడులు చేపట్టింది. ఇదే తరహాలో తిరువనంతపురంలోనూ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను,ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధినం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బీహార్‌లో కూడా పీఎఫ్ఐతో సంబంధం ఉన్న ముగ్గురి ఇళ్ళలోనూ దాడులు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పెర్కొన్నారు.