ముఖ్యమంత్రి ఇల్లు ఖాళీ చేసిన ఉద్ధవ్ థాక్రే
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్ వర్ష ప్రాంగణాన్ని ఖాళీ చేశారు. కుటుంబ నివాసం మాతోశ్రీలోకి అడుగుపెట్టారు. మహారాష్ట్రలో జరిగిన మొత్తం పరిణామాలపై భావోద్వేగ వ్యాఖ్యలు చేసిన ఉద్ధవ్… ఇక రాజీనామా తప్పదన్న నిర్ణయానికి వచ్చినట్టు కన్పిస్తున్నారు. ఎక్‌నాథ్ షిండే వ్యూహాలతో చిత్తయ్యామని భావిస్తున్న థాక్రే రాజకీయంగా ఎలాంటి డామేజ్ జరక్కూడదన్న ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. థాక్రే… సీఎం నివాసం ఖాళీ చేసి మాతోశ్రీకి వస్తున్నారని తెలియగానే అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడారు. కార్యకర్తలుకి అభివాదం చేసిన థాక్రే గంభీరంగా కన్పించారు. తండ్రితోపాటు తనయుడు ఆదిత్య థాక్రే సైతం ఉన్నారు. అభిమానులను ఆదిత్య థాక్రే ఉత్సాహపరిచారు. కరోనా పాజిటివ్ అయినప్పటికీ… మీడియా సమావేశం నిర్వహించిన వెంటనే ఇల్లు ఖాళీ చేయడం ద్వారా థాక్రే పెద్ద వ్యూహంలోనే ఉన్నారన్న వర్షన్ ను విశ్లేషకులు విన్పిస్తున్నారు.
నా సొంత మనుషులు… నేను ముఖ్యమంత్రిగా ఉండొద్దంటే… నేను తక్షణం రాజీనామా చేస్తా… పదవిలో ఒక్క క్షణం కూడా ఉండబోనంటూ చెప్పడం వెనుక పులి వ్యూహాలు సమయం కోసం వేచి చూస్తున్నాయని చెబుతున్నాయ్. బాల్ థాక్రే తనయుడ్ని… పదవుల కోసం వెంపర్లాడేవాడ్ని కాదన్నారు ఉద్ధవ్. ముఖ్యమంత్రి పీఠం నుంచివైదొలుగుతాను… తర్వాత సీఎం శివసేన నుంచి ఉంటారా అని అంటూ ప్రశ్నించారు ఉద్ధవ్… రెబల్ నాయకుడిగా దీమా ప్రదర్శిస్తున్న ఎక్ నాథ్‌కు రియల్ సవాల్ విసిరారు ఉద్ధవ్ థాక్రే. శివసేన రెబల్స్‌కు బీజేపీకి ఊడిగం చేయాలనిపిస్తోందని… వారికి నాయకత్వం వహించే సత్తా లేదన్న వర్షన్ విన్పించారు థాక్రే. ఇప్పటికే షిండేకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అటు కాంగ్రెస్, ఇటు ఎన్సీపీ సైతం సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలతో బీజేపీ అప్రమత్తమయ్యింది. ప్రస్తుతం 4 గురు స్వతంత్రులతో కలిసి మొత్తం 34 మంది ఎమ్మెల్యేలు ఎక్ నాథ్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోడాన్ని శివసేన కార్యకర్తలు అంగీకరించడం లేదంటూ ఎమ్మెల్యేలు లేఖలో చెప్పుకొచ్చారు.