InternationalNews

కామన్వెల్త్‌ క్రికెట్లో చితక్కొట్టిన స్మృతి- పాక్ 99కే ఆలౌట్

Share with

కామన్వెల్త్ క్రీడల్లో భారత్ చెలరేగిపోతోంది. వరుసగా పతకాల పంట పండిస్తోంది. మహిళల క్రికెట్‌ కూడా మగవారి క్రికెట్‌తో సమానంగా అభిమానుల మన్ననలు అందుకుంటోంది. మన దేశ అమ్మాయిలు మగవారికి ఎందులోనూ తక్కువ కాదన్నట్లు తమ  సత్తాను చాటుతున్నారు.ఈ కామన్వెల్త్ మహిళల టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది భారత మహిళా జట్టు. దాదాపుగా 4 ఏళ్ల తరువాత టీ20 లో పాక్‌తో తలపడిన భారత్ పాకిస్థాన్‌ను 8 వికెట్ల తేడాలో చిత్తు చేసింది. ఈ కామన్వెల్త్‌ క్రికెట్లో తొలివిజయం నమోదుచేసింది. ఈవిజయంలో ముఖ్యపాత్ర వహించిన  స్మృతిమంధాన 63 పరుగులతో చెలరేగిపోయింది.

పాక్ నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని కేవలం 11.4 ఓవర్లలోనే చేధించింది. స్మృతి 42 బంతుల్లో 8 ఫోర్‌లు, 3 సిక్స్‌లతో అదరగొట్టింది. నిన్న ఉదయం ఆటకు వర్షం వల్ల అంతరాయం కలగడంతో ఇన్నింగ్స్‌ను 18 ఓవర్లకు తగ్గించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లకే 99 పరుగుల వద్ద కుప్పకూలిపోయింది. రేణుకాసింగ్, మేఘనా సింగ్ ,స్నేహ్ రాణా, రాధా యాదవ్, షెఫాలీ వర్మలు అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్‌ను 99 పరుగులకే కట్టడి చేసారు. పాక్ నుండి మునీబా అలీ మాత్రమే 32 పరుగుల స్కోర్ సాధించగలిగింది. స్నేహ్ ఒకే ఓవర్లో ఇద్దరిని ఔట్ చేసిన అనంతరం స్మృతి, మరో ఓపెనర్ షెపాలీ వర్మతో కలిసి తొలి వికెట్ పడకముందే 61 పరుగులకు భారత్ ‌స్కోర్‌ను తీసుకెళ్లింది. తర్వాత షెఫాలీ ఔటైనా తెలుగమ్మాయి సబ్బినేని మేఘనతో కలిసి రెండో వికెట్‌కు 33 పరుగులు జత చేసింది. ఆఖరున ఫాతిమా సనా బౌలింగ్‌లో బంతిని బౌండరీకి పంపి భారత జట్టుకు ఘనవిజయాన్ని అందించింది స్మృతిమంధాన.