హిందూపూర్ నుంచి అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ! పరిపూర్ణానంద దారెటు?
ప్రముఖ ఆధ్యాత్మిక గురు స్వామి పరిపూర్ణానంద ఈసారి హిందూపురం నుంచి బరిలో దిగాలని ప్రయత్నాలు చేసుకున్నారు. గత రెండేళ్లుగా ఆయన హిందూపూర్ ఎంపీగా నిలబడేందుకు స్థానికంగా సిద్ధమయ్యారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా తనకు టికెట్ వస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ అండదండలు ఆయనకు టికెట్ వచ్చేలా చేస్తాయని అభిమానులు భావించారు. అయితే టీడీపీ హిందూపూర్ నుంచి అభ్యర్థిని ఖరారు చేయడంతో ఆయనేం చేస్తారన్నదానిపై ఉత్కంఠ రేగుతోంది.

హిందూ ఆత్మబంధువుగా పేరుగాంచిన పరిపూర్ణానంద, హిందూపురం నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఆయనకు నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన కార్యకర్తల బేస్ ఉంది. బీజేపీతోపాటుగా, ఆయన సొంతంగా బలగాన్ని సిద్ధం చేసుకున్నారు. పరిపూర్ణానందకు టికెట్ నిరాకరించడంతో ఇప్పుడు ఆయన అభిమానులు ఆగ్రహోదగ్ధులవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పరిపూర్ణానంద స్వతంత్రంగా బరిలో దిగాలని వారు కోరుతున్నారు. హిందూస్తాన్‌కు మోదీజీ.. హిందూపురానికి స్వామిజీ ఉండాల్సిందేనని వారు నినదిస్తున్నారు.

పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన భాగస్వామ్యంలో టీడీపీ అభ్యర్థి పార్థసారధి ఇక్కడ్నుంచి బరిలో దిగుతున్న తరుణంలో.. బీజేపీ స్వామీజికి బీఫామ్ ఇస్తుందా లేదంటే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇవాళ, రేపు బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీలో ఉన్న కొందరు పరిపూర్ణానంద పేరును లిస్టులో లేకుండా చేశారని కూడా చెబుతున్నారు. పైకి నవ్వుతూ ఆయనతో ఉన్నప్పటికీ కొందరు లోపల కత్తులు నూరినట్టు తెలుస్తోంది.

