భార్య వేధింపులతో సుభాష్ సూసైడ్… ‘హ్యాష్‌ట్యాగ్ మెన్ టూ’
బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ సూసైడ్ కేస్ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. భార్య వేధింపుల వల్లే చనిపోతున్నట్లు సూసైడ్ వీడియో విడుదల చేశారు. ఈ కేసులో సుభాష్ చేసిన వీడియోకు మగవాళ్ల కష్టాల కోసం “హ్యాష్‌ట్యాగ్ మెన్ టూ” అనే నినాదం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో అతని భార్య నిఖిత సింఘానియా పేరు కూడా బాగా ట్రెండ్ అవుతోంది. 2019లో వివాహమైన ఈ జంటకు మరుసటి ఏడాదే బాబు పుట్టాడు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె కొడుకుని తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది.
మూడేళ్లుగా దూరంగా ఉన్న ఆమె సుభాష్, అతని కుటుంబ సభ్యులపై 9 కేసులు నమోదు చేసింది. “శారీరకంగా హింసించడం, అసహజ శృంగారం, వరకట్న వేధింపులు, తన తండ్రిని కుంగదీసి గుండెపోటుతో చనిపోయేలా చేయడం” వంటి ఇన్ని నేరాలు తనపై మోపేసరికి తట్టుకోలేక మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుభాష్. ఆమె కేసులు విత్‌డ్రా చేసుకోవడానికి భరణంగా రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని, కొడుకును చూడాలంటే రూ.30 లక్షలు డిమాండ్ చేస్తోందని విచారం వ్యక్తం చేస్తూ వీడియో తీశాడు. వీటిపై అతని భార్య పనిచేసే కంపెనీకి ఆమెను ఉద్యోగం నుండి తొలగించమంటూ అనేకమంది మెయిల్స్ పెడుతున్నారు. మీడియా ప్రతినిధులు ఆమెను కలవాలని వెళితే ఆమె తల్లి, సోదరుడు వారిని బెదిరించినట్లు సమాచారం.

