NationalNewsNews Alert

ఈడీ విచారణకు రెండోసారి సోనియా గాంధీ

Share with

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట రెండో రౌండ్ విచారణకు హాజరుకానున్నారు. ED దర్యాప్తు అధికారులు సోనియా స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఇవాళ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోనియా ఒకరోజు విచారణకు హాజరయ్యారు. 75 ఏళ్ల సోనియా గాంధీని జులై 21న మొదటి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో రెండు గంటలకు పైగా ప్రశ్నించగా, కాంగ్రెస్ ప్రమోట్ చేసిన ఆర్థిక అవకతవకలపై సంస్థ వేసిన 28 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సోనియా గాంధీతోపాటు ప్రియాంక గాంధీ వాద్రా, రాహుల్ గాంధీ గత వారం మాదిరిగానే ఆమెతో పాటు మళ్లీ ఈడీ కార్యాలయానికి వస్తారని తెలుస్తోంది. సోనియా ఈడీ విచారణపై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయ్. ఇవాళ కూడా కాంగ్రెస్ నేతలు నిరసనలు చేపట్టే అవకాశముంది. ఈడీ విచారణ బీజేపీ ప్రతీకారంలో భాగమని కాంగ్రెస్ పేర్కొంటోంది.

ఢిల్లీ పోలీసులు కూడా CRPF మరియు RAF సిబ్బందితో భారీ బలగాలను మోహరించారు. సోనియా నివాసం, ED కార్యాలయం మధ్య ఒక కిలోమీటరు పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది చివర్లో ED మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ నిబంధనలతో తాజాగా విచారణ మొదలైంది. 2013లో బీజేపీ ఎంపి సుబ్రమణ్యస్వామి చేసిన ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు ఆధారంగా యంగ్ ఇండియన్‌పై ఆదాయపు పన్ను శాఖ విచారణను ఇక్కడి ట్రయల్ కోర్టు స్వీకరించిన తర్వాత… ఇప్పుడు విచారణ జరుగుతోంది. యంగ్ ఇండియన్‌ సంస్థలో సోనియా, రాహుల్ గాంధీ ప్రమోటర్లు.. వారిదే మెజారిటీ వాటా. తల్లి, కొడుకుకు యంగ్ ఇండియాలో 38 శాతం వాటాలున్నాయ్. అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ AJL కాంగ్రెస్‌కు చెల్లించాల్సిన ₹ 90.25 కోట్లను తిరిగి పొందేందుకు యంగ్ ఇండియన్ కేవలం ₹ 50 లక్షలు మాత్రమే చెల్లించి, మోసం చేయడానికి… నిధులను దుర్వినియోగం చేయడానికి గాంధీ కుటుంబ సభ్యులు కుట్ర పన్నారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు.

గత ఏడాది ఫిబ్రవరిలో స్వామి పిటిషన్‌పై స్పందించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టు గాంధీజీలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌లను ఈడీ ఏప్రిల్‌లో ప్రశ్నించింది. తాము ఎలాంటి తప్పు చేయలేదని యంగ్ ఇండియన్ కంపెనీ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం స్థాపించబడిందని… “లాభాపేక్ష లేని” కంపెనీ అని, అందువల్ల మనీలాండరింగ్ గురించి ఛాన్స్ లేదని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. విచారణ సమయంలో నేషనల్ హెరాల్డ్ విషయంలో గాంధీ కుటుంబానికి ఎలాంటి ఆస్తులు, రాబడి లేవని రాహుల్ గాంధీ విచారణలో ఈడీకి స్పష్టం చేశారు. విచారణలో 800 కోట్ల విలువైన ఆస్తులు AJL ఆధీనంలో ఉన్న సమయంలో… ఇండియన్ వంటి లాభాపేక్ష లేని కంపెనీకి బదలాయింపు జరిగిన తీరును, మొత్తం గుడుపుఠానినీ తెలుసుకోవాలని ఈడీ భావిస్తోంది.