సిగాచీ సీఈవో అరెస్ట్
సిగాచీ పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. 54 మంది కార్మికుల మృతికి కారణమైన పాశమైలారం ప్లాంట్ పేలుడు ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటు చేసుకోవడం గమనార్హం. శనివారం రాత్రి ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు రహస్యంగా రిమాండ్‌కు తరలించారు. జూన్ 30న జరిగిన ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తులో జాప్యం జరగడం, బాధ్యులను గుర్తించకపోవడంపై ఇటీవల తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కమిటీ నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టు మండిపడిన నేపథ్యంలో, పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. మరోవైపు తమకు రావాల్సిన పరిహారం అందలేదని బాధిత కుటుంబాలు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

