ఓటుకు నోటు భయంతోనే ప్రాజెక్టుల తాకట్టు!
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాల కోసం, రాజకీయ భయం కోసం రాయలసీమ,నెల్లూరు రైతాంగ ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. నెల్లూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడగగానే చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేయడం నిజం కాదా?,” అని కాకాణి సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన రాజకీయ ఉనికి కోసం,గతంలోని ‘ఓటుకు నోటు’ కేసు ఎక్కడ తిరిగి మెడకు చుట్టుకుంటుందనే అన్న భయంతోనే ఏపీ రైతుల ప్రయోజనాలను రేవంత్ రెడ్డి పాదాల చెంత పెట్టారని విమర్శించారు.పొరుగు రాష్ట్రం అడ్డదారుల్లో ప్రాజెక్టులు నిర్మిస్తున్నా, శ్రీశైలం నుంచి నీటిని తరలించుకుపోతున్నా చంద్రబాబు నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది ఆ ప్రాంత రైతులకు ఒక భరోసా (ఇన్సూరెన్స్) లాంటిదని, అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ దీనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని కాకాణి గుర్తు చేశారు. “శ్రీశైలంలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పుడు కూడా రాయలసీమకు నీరందించే సంజీవని లాంటి ఈ ప్రాజెక్టును చంద్రబాబు నిలిపివేయడం దారుణం. 20 టీఎంసీల నీళ్లు పోతే ఏంటి అని అసెంబ్లీలో ప్రభుత్వం మాట్లాడటం రైతులను అవమానించడమే,” అని మండిపడ్డారు.
ఈ ప్రాజెక్టు నిలిపివేత వల్ల కేవలం రాయలసీమ మాత్రమే కాకుండా నెల్లూరు జిల్లా మరియు ఒంగోలులోని కొన్ని ప్రాంతాల రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతుందని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతుల కోసం మూడుసార్లు అవకాశం వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వాటిని ఉపయోగించుకోలేదని ఆరోపించారు. కేవలం వైఎస్సార్, జగన్ మాత్రమే ఈ ప్రాంత రైతుల కష్టాలను గుర్తించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని హెచ్చరించారు.తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి సామర్థ్యం పెంచుకుంటున్నా, అదనంగా 8 టీఎంసీల నీటిని వినియోగించుకుంటున్నా ఏపీ ప్రభుత్వం కనీసం నిలదీయకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని కాకాణి అనుమానం వ్యక్తం చేశారు.

