పెళ్లిరోజునే భర్తకు హ్యండిచ్చిన సాయిప్రియ
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో మిస్ అయిన సాయిప్రియ మిస్సింగ్ మిస్టరీ వీడింది. సాయి ప్రియ ఇటీవల పెళ్లి రోజు కావడంతో భర్తతో పాటు బీచ్ కు వెళ్లింది. ఉన్నట్టుండి సాయి ప్రియ కనిపించకపోవడంతో భర్త శ్రీనివాస్, సాయిప్రియ బీచ్‌లో గల్లంతు అయ్యిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు రెండు నేవి కోస్ట్ గార్డ్ షిప్ లతో పాటు ఓ హెలికాప్టర్ సాయంతో సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత మూడు రోజలు నుంచి తీవ్రంగా గాలిస్తున్న పోలీసులకు సాయి ప్రియ ఆచూకి ఏ మాత్రం దొరకలేదు. ఇక పెళ్లి రోజున భర్తతో పాటు సరదాగ గడిపేందుకు వస్తే ఇలా జరగడంతో సాయి ప్రియ తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం నుంచి గాలిస్తున్న సాయి ప్రియ ఆచూకి దొరకకపోవడంతో నేవీ అధికారులు, పోలీసులు, గజ ఈతగాళ్లు సైతం రంగలోకి దిగి తీవ్రంగా శ్రమించారు.
అయితే ఈ క్రమంలోనే సాయి ప్రియ ప్రియుడితో నెల్లూరులో కనిపించడంతో భర్త, పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శ్రీనివాస్‌తో వివాహానికి కంటే ముందు.. సాయిప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని సమాచారం. వివాహానికి ముందు రెండు సార్లు రవితో కలిసి సాయిప్రియ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు శ్రీనివాస్‌ను 2020 జూలై 25న పెళ్లి చేసుకుంది.శ్రీనివాస్ హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోండటంతో ఈ జంట హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి ప్రియ, రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది. నాలుగు నెలల క్రితం కంప్యూటర్ కోర్సు చేయాలంటూ సాయి ప్రియ హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చింది. ఇదే సమయంలో సెకండ్ మ్యారేజ్ డే అని శ్రీనివాస్ ఈ నెల 25న హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చాడు. అదే రోజు సాయంత్రం 5.30 కి భర్త తో కలిసి బీచ్‌కి వెళ్లిన సాయి ప్రియ, అంతకు ముందే ఆ సమాచారాన్ని ప్రియుడు రవికి చేరవేసింది. శ్రీనివాస్ ఏమరపాటుగా ఉన్న సమయంలో రవితో కలిసి సాయి ప్రియ అక్కడి నుంచి పారిపోయింది. ఇది తెలియని శ్రీనివాస్ తన భార్య తప్పిపోయిందని తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఏకంగా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టారు.