ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న సాయిప్రియ
విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నానంటూ ఆడియో మెసేజ్ పంపించింది. తన కోసం వెదకొద్దని… అలా చేస్తే చచ్చిపోతానంటూ వార్నింగ్ ఇచ్చింది. తనకు బతకాలని ఉందని… వెతికితే మాత్రం తన ప్రియుడితో కలిసి సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించింది. రెండు రోజుల క్రితం విశాఖ ఆర్కేబీచ్‌లో సాయిప్రియ అదృశ్యమైంది. బీచ్ చూడటానికి వచ్చిన తన భార్య సముద్రంలో గల్లంతైందోమో అని పోలీసులకు భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు చేశాడు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు, నేవీ సిబ్బంది సముద్రంలో గాలింపు చేపట్టారు. హెలికాప్టర్లను ఉపయోగించి జల్లెడ పట్టారు.
ఈ వెతుకులాట సాగుతుండగానే… తల్లిదండ్రులకు సాయిప్రియ వాట్సాప్ మెసేజ్ పంపించింది. నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. నన్నేం రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయింది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని వెతకోద్దు ఒకవేళ నా కోసం వెతికితే చనిపోతా. రవి పేరెంట్స్‌ను ఏమీ చేయొద్దంది. నిర్ణయం తీసుకోవడంలో రవి, వాళ్ల పేరెంట్స్ ప్రమేయం లేదంది. వారిని వేధించొద్దని అభ్యర్థించింది. రవితో పెళ్లి కూడా జరిగిపోయిందని మెడలో తాళిబొట్టుతో ఉన్న ఫొటోలను కూడా పంపింది.తన కోసం వెతికిన అధికారులకు క్షమాపణలు చెప్పింది సాయిప్రియ. ఇక సముద్రంలో గల్లంతైందని భావించి రెండు రోజులుగా భార్య కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాస్‌కు, ఆయన తల్లిదండ్రులకు సాయిప్రియ పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది.
ఎవరీ రవి
సాయిప్రియ పెళ్లిచేసుకున్న రవి ఎవరనే దానిపై అంతా ఆరా తీస్తున్నారు. రవి కుటుంబం చాలాకాలం కిందట తిరుపతి నుంచి విశాఖ వలస వచ్చారు. ఎన్‌ఏడీ జంక్షన్ సమీపంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. సాయిప్రియ కుటుంబం కూడా శాంతినగర్ కావడంతో వారిద్దరికీ చాలాకాలంగా పరిచయం ఉంది. ఇది ప్రేమకు దారితీసింది. కానీ సాయిప్రియ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావుతో 2020 జూలై 25న పెళ్లిచేశారు. అయితే రవిని మరిచిపోలేని సాయి ప్రియ ఈనెల 25న తన భర్తతోపాటు బీచ్‌కు వెళుతున్నప్పుడే విషయాన్ని తన ప్రియుడికి చెప్పింది. దీంతో రవి కూడా వారితోపాటే బీచ్‌కు వెళ్లాడు. శ్రీనివాసరావు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లు చూస్తున్న సమయంలో సాయిప్రియ అక్కడి నుంచి రవితో కలిసి వెళ్లిపోయింది. రైలులో మొదట నెల్లూరు, ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు. పోలీసులు బీచ్‌రోడ్డులోని సీసీ కెమెరాలను పరిశీలించగా సాయిప్రియ ఆచూకీ కనిపించలేదు. కానీ ఒక యువకుడు అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టు కనిపించడంతో అనుమానం కలిగింది. ఆ వ్యక్తిని సాయిప్రియ తల్లిదండ్రులకు చూపించగా, రవిగా గుర్తించారు. దీంతో పోలీసులు రవి సెల్‌ఫోన్‌ను ట్రాకింగ్ చేయడంతో నెల్లూరులో ఉన్నట్టు తర్వాత బెంగళూరు వెళ్లిపోయినట్టు గుర్తించారు. అదే సమయంలో సాయిప్రియ తన తండ్రికి మెసేజ్ చేయడంతో మిస్టరీ వీడిపోయింది. సాయిప్రియను బెంగళూరు నుంచి నగరానికి తెచ్చేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. సాయి ప్రియను వెదకడం కోసం జీవీఎంసీకి కోటి రూపాయలు చమురు వదిలింది.