దేశానికి స్ఫూర్తి… యువతకు దీప్తి… కలామ్‌జీ నిను మరవదు ఈ నేల
“నిద్రలో కనేది కల కాదు. మిమ్మల్ని నిద్రపోనీకుండా చేసేదే అసలైన కల”. ఈమాటలు ఎవరివో గుర్తున్నాయా… మిసైల్ మ్యాన్ అని భారతీయులు గర్వంగా పిలుచుకునే సైంటిస్ట్ అబ్దుల్‌కలామ్‌వి. కొన్నిపదవులు కొందరికి గౌరవం తీసుకువస్తే కొందరు మహానుభావులు ఆ పదవులకే గౌరవం తీసుకువస్తారు. అలాంటివారిలో అగ్రగణ్యులు, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్. పువ్వుకి సుగంధం అబ్బినట్లుగా రాష్ట్రపతి పదవికే గౌరవం తీసుకొచ్చారు. ఎందరో యువతీ యువకులకు స్ఫూర్తిగా, మార్గదర్శకంగా నిలిచిన ఆదర్శమూర్తి ఆయన. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2015 జూలై 27న తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఆయన 7వ వర్ధంతి సందర్భంగా… చిరస్మరణీయమైన ఆయన జీవితవిశేషాలను స్మరించుకుందాం…
కలామ్ ఖురాన్‌తో పాటు, భగవద్గీతను చదివేవారు. మతఘర్షణలను వ్యతిరేఖించే శాంతికాముకుడు ఆయన. కలాం చిన్నతనం అంతా రామేశ్వరంలోనే గడిచింది. భారత్ తయారు చేసిన చాలా మిసైల్స్ వెనక ఆయన హస్తం ఉంది. అగ్ని, పృథ్వి లాంటి క్షిపణుల తయారీలోనూ, ప్రయోగంలోనూ ఆయన కీలకపాత్ర వహించారు. భారత్‌లో అత్యున్నత పురస్కారాలుగా భావించే పద్మభూషణ్, పద్మ విభూషణ్‌తో సహా భారత రత్న కూడా సొంతం చేసుకున్నారు అబ్దుల్ కలాం. 1981లో పద్మభూషణ్, 1990లో పద్మ విభూషణ్ వరించాయి. ఆయనకు 1997లో భారత రత్న దక్కింది. 1958 లో మద్రాస్ మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టాను పొందారు. పైలట్ అవ్వాలని కలలు కన్న ఆయనకు ఆ ఉద్యోగం లభించకపోవడంతో 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. విద్యార్థులకు పాఠాలు చెప్పడమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అలా చెపుతూనే చనిపోవాలని కోరుకున్నాడాయన. మహాత్ముల ఆశలు వ్యర్థం కావనట్లు, కోరుకున్నట్లే 2015 జూలై 26 షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
ఆయన జీవితాంతం బ్రహ్మచారిగానే జీవించారు. రాష్ట్రపతిగా ఉండేకాలంలో కూడా తన బంధువులెవరైనా వస్తే, వారికి ప్రభుత్వ ఖర్చుతో కాకుండా తన సొంత ఖర్చులే పెట్టుకొనేవారు. రాష్ట్రపతిగా ఎన్నోదేశాలు సందర్శంచిన ఆయన తనకు ఆయా దేశాలవారు అందించిన బహమతులను భారత మ్యూజయంకే ఇచ్చారు. తనకంటూ ఏదీ ఉంచుకోని నిస్వార్థజీవి. ఏపనిలోనైతే మీరు విఫలమయ్యారో… ఎప్పుడూ దానిని వదలొద్దు.. ఎందుకంటే విఫలం.. విజయానికి మొదటి మెట్టు అని యువతకు ఎప్పుడూ బోధించేవారు.