షూటింగ్‌ల నిర్వహణపై క్లారిటీ వచ్చేదెప్పుడు?
కరోనా కారణంగా ప్రపంచంలోనూ, దేశంలోనూ ఎన్నో రంగాలు ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాయి. అయితే అందులో ముఖ్యంగా ప్రజలకు ఎన్నో ఏళ్ళ నుంచి వినోదాన్ని పంచి పెడుతున్న.. సినిమా రంగం కూడా తీవ్రంగా నష్టపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా తర్వాత కొన్ని రంగాలు లాభాల్లో మళ్ళీ వేగం పుంజుకున్నప్పటికీ.. సినిమా రంగం మాత్రం ఇంకా నష్టాల ఊబిలో కూరుకుపోతున్నట్టుగా కన్పిస్తుంది. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కరోనా కాలంలో బాగా ఫామ్‌లోకి వచ్చిన ఓటీటీ సినిమా నిర్మాతలకు, సినిమా డిస్ట్రిబ్యూటర్లకు శాపంగా మారిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర నిర్మాతలు ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అదే విధంగా వీటిని అధిగమించడానికి తగు చర్యలు చేపట్టాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు తెలుగు చిత్ర నిర్మాతలు అందరూ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా ఈ మధ్య కాలంలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ..వారికి ఓటీటీ, ఇతర అన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వల్ల వస్తోన్న నష్టాల గురించి చర్చిస్తున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఆగష్టు 1నుంచి అన్ని సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే తాజాగా నిర్వహించిన ఫిలిం ఛాంబర్ ప్రత్యేక సమావేశాల్లో..ఈ నిర్ణయానికి బ్రేక్ పడినట్లు తెలుస్తుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు ఆగష్టు 1 లోగా పరిష్కరిస్తామన్న కమిటీ… తాజాగా మరికొంత సమయం తీసుకుంటున్నట్టుగా కన్పిస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ వెల్లడించారు. సినిమా షూటింగ్స్ బంద్ చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం మూడు సమస్యలపైనే సమావేశంలో చర్చ జరిగిందన్నారు. ఇండస్ట్రీని బతికించుకోవడంతోపాటు, సినీ కార్మికులకు నష్టం కలిగించకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 30న జరిగే సమావేశంలో మిగతా వాటికి సంబంధించి చర్చిస్తామన్నారు. అదే విధంగా సినిమా చిత్రీకరణలు నిలిపేసే అంశంగా ఈ నెల 31న జరిగే జనరల్ బాడీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని సి.కళ్యాణ్ తెలిపారు.