విపక్ష నేతలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో విపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే రేషన్ కార్డులు రావడం లేదని ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. గురువారం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కుటుంబ డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మూసీని అడ్డం పెట్టుకుని ఎన్నాళ్లు బతుకుతారని, హైదరాబాద్‌లో మీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. కేటీఆర్, హరీష్ రావు, సబితలకు సంబంధించిన ఫామ్ హౌస్‌లు కూల్చాలా అని ప్రశ్నించారు. అవెక్కడ కూల్చేస్తామో అనే భయంతో పేదలను అడ్డం పెట్టుకుని ధర్నాలు, దీక్షలు మొదలుపెట్టారని మండిపడ్డారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న రూ.15 వందల కోట్లు పార్టీ ఖాతాలలో ఉన్నాయి కదా. వాటి నుండి రూ.500 కోట్లు మూసీ పరివాహక ప్రాంతానికి పంచిపెట్టండన్నారు. చిన్నపాటి వర్షానికే మునిగిపోతున్న హైదరాబాద్‌ను ముంపు నుండి కాపాడే చర్యలు చేపడుతుంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
మరోపక్క బీజేపీ, బీఆర్‌ఎస్‌లు కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ నిధుల కోసం ప్రధాని మోదీ వద్దకు వెళదాం. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను తీసుకురండి. కేంద్రం నుండి రూ. 25 వేల కోట్లు ఇప్పించండి. చెరువులను ఎవరు ఆక్రమించారో తేలుద్దాం అంటూ వ్యాఖ్యానించారు.

