Home Page SliderTelangana

“దేశాన్ని చీల్చాలని కుట్ర చేసే వాళ్లతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నాడు”.. బండి సంజయ్

Share with

సిక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ కు లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేంద్ర  హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దేశాన్ని చీల్చాలని కుట్ర చేసే వాళ్లతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నాడు.ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అంటూ కొత్త అర్థం చెప్పారు. జనరల్ బజారులో తిరుగుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. సభ్యత్వ నమోదులో సంచలనం సృష్టించాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ  విదేశాల్లో భారత్ ను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీకి ఈ దేశంలో ఉండే అర్హత లేదని మండిపడ్డారు. సిక్కులను ఊచకోత కోసిన చరిత్ర కాంగ్రెస్ సొంతమని, వారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. రాహుల్ గాంధీ విదేశాల్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు. విదేశాలకు వెళ్లి స్వదేశాన్ని విమర్శిస్తారా? గతంలోనూ విదేశాలకు వెళ్లి భారత్ ప్రమాదంలో ఉంది. జోక్యం చేసుకోవాలని పాశ్చాత్య దేశాలను కోరిన మూర్ఖుడు రాహుల్ గాంధీ. మొన్న అమెరికాకు వెళ్లి భారత ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించింది. మోదీకి అనుకూలంగా ఉండటంవల్లే బీజేపీకి సీట్లు వచ్చాయని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? ఆయనకు ఈ దేశ చట్టాలు, న్యాయస్థానాలు, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం లేకపోవడం సిగ్గు చేటు.

సిక్కులు తలపాగా, కడియం పెట్టుకునే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గు చేటు. సిక్కులను ఊచకోత కోసి దుర్మార్గంగా వ్యవహరించిందే రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ. సిక్కుల గురించి మాట్లాడే నైతిక అర్హత రాహుల్ గాంధీకి లేనేలేదు. దేశాన్ని చీల్చాలని కుట్ర చేసే వాళ్లతో రాహుల్ గాంధీ చేతులు కలుపుతున్నాడు. అందుకే ప్రత్యేక దేశం కావాలని భారత్ ను చీల్చాలనుకుంటున్న టెర్రరిస్టు సంస్థలు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సమర్ధిస్తున్నాయి. దీనినిబట్టి రాహుల్‌కు, టెర్రరిస్టు సంస్థలకు లింకులున్నాయని అనుమానం వస్తోంది. అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానేకాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని మూడు ముక్కలు చేసింది. రాహుల్ గాంధీ పొరపాటున అధికారంలోకి వస్తే మళ్లీ 7 ముక్కలు చేసే ప్రమాదముంది. రిజర్వేషన్లను ఎత్తేస్తామంటూ రాహుల్ గాంధీ అడ్డగోలుగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించరు? జమ్మూకాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను మళ్లీ తీసుకురావాలని, రెండు జెండాలుండాలని కోరుకునే పార్టీలతో కాంగ్రెస్ జట్టుకట్టడం సిగ్గు చేటు. అందుకే ప్రతి భారతీయుడు కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు, రాహుల్ దేశ ద్రోహ వ్యాఖ్యలపై స్పందించాలని కోరుతున్నా. దేశ ద్రోహ వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దేశం వదిలి వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నా. అంటూ మండిపడ్డారు.