ఓటరు నాడి పట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న రాజకీయ పార్టీలు
• నవరత్నాల ప్రచారంతో ఆకట్టుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్సిపి
• వైఫల్యాలను విప్పి చెబుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు
• ఓటరు ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేదంటున్న నాయకులు
ఏపీలో రాజకీయ పార్టీలు ఎవరికి వారే అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆకాంక్షతో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఎత్తు జిత్తులతో వివిధ కార్యక్రమాల పేరుతో ఎన్నికలకు ఏడాదిపైగా సమయం ఉన్నప్పటికీ ఓటర్ దేవుడికి ఇప్పటి నుంచే మొక్కుతున్నారు. ఎన్నికల రణరంగం ప్రారంభమయ్యాక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే రాజకీయ నాయకులు ఎన్నికల షెడ్యూల్‌తో సంబంధం లేకుండా సామాన్యుల ఇంటి తలుపులు తడుతున్నారు. ఎన్నికల ఫీవర్ రాజకీయ నేతలను వణికిస్తోంది. నాయకులు ఓటర్ నాడి పట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓటర్ మాత్రం ఏ పార్టీ వారు చెప్పిన ఓపికగా వినటం చూస్తుంటే నేతల్లో గుబులు పుడుతుంది. ఓటర్ ఆంతర్యం ఏమిటి అర్థం కావటం లేదంటున్నారు ప్రజాప్రతినిధులు . ఓటరు మాత్రం వింటున్నాం, చెప్పండి అంటూ అందరికీ మద్దతు పలకడం విశేషం. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గడపగడప కార్యక్రమం పేరుతో సంక్షేమం అభివృద్ధి గురించి వివరిస్తున్నారు.

ఇక ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీది అస్తవ్యస్త పాలన అంటూ విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. ఇదేం కర్మ రాష్ట్రానికి బాబు పాలన రావాలి మళ్లీ అంటూ ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఇక జనసేన మాత్రం తనదైన శైలిలో ఓటరును ఆకట్టుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల షెడ్యూలుకు ఏడాది ముందు నుండే వివిధ కార్యక్రమాల పేరుతో అధికార ప్రతిపక్ష పార్టీలు సైతం సామాన్యుల ఇంటి బాట పట్టటం ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఓటర్లలో ఆలోచన రేకెత్తించడం విశేషం. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తాము అందించిన సంక్షేమ పథకాలను ఏకరువు పెట్టడంతో పాటు కుటుంబ అవసరాలను తెలుసుకొని వాగ్దానాలు గుప్పిస్తూ వారి అనుగ్రహం కోసం తంటాలు పడుతున్నారు.

ఇక తెలుగుదేశం జనసేన నాయకులు ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. అధికార పార్టీ గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల మధ్యకు వస్తూ ప్రభుత్వ పథకాలు అందుకున్న కుటుంబాలకు గుర్తు చేస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా మరో కొత్త నినాదంతో మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదంతో ప్రతి ఇంటి ముందు స్టిక్కర్స్ వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీ రచ్చబండ కార్యక్రమంతో వీధి వీధినా సమావేశాలు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యక్రమాల్లో కొనసాగుతుండగా దాంతోపాటు ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో 14 రకాల ప్రశ్నావళి రూపొందించి గృహ యజమాని నుండి వివరాలను రాబట్టడం ద్వారా ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇక భారతీయ జనతా పార్టీ ఇంటి బాట పట్టక పోయినప్పటికీ తమ కార్యక్రమాలను విస్తృతం చేసి ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారు.

సామాన్య ఓటర్ మాత్రం ఎవరు చెప్పింది వాస్తవమో తెలియక అధికార ప్రతిపక్ష నేతలు చెప్పే అన్ని విషయాలను గమనిస్తూ వచ్చిన వారికి సంతృప్తికర సమాధానం చెప్పి పంపుతున్నారు. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వాలంటీర్ల ద్వారా ప్రతి 50 కుటుంబాల వారి పూర్తి సమాచారాలను రాబట్టుకుంటూ సంక్షేమ పథకాలను వారి దరికి చేర్చడం ద్వారా ఆయా కుటుంబాలకు దగ్గరైన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా గృహ సారధులు సచివాలయ కన్వీనర్లను నియమించి వాలంటీర్లపై గృహ సారధులు సచివాలయం కన్వీనర్‌ల అజమాయిషి చేసే విధంగా కార్యాచరణ రూపొందించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను అమలుపరచే క్రమాన్ని అధికార పార్టీ వేగవంతం చేసింది. ఇప్పటికే పదవీకాలం ముగిసిన 56 కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగించడంతోపాటు నాయి బ్రాహ్మణులకు దేవాలయ పాలకవర్గంలో డైరెక్టర్లుగా నియమించే విధంగా జీవోను జారీ చేయటం ఎస్సీ, ఎస్టీ ,బీసీ మైనార్టీలకు వివాహ కానుక మూడేళ్ల తర్వాత ప్రవేశ పెట్టటం ఇటీవలే విదేశీ విద్యా కానుకను మంజూరు చేయడం వంటివి అధికార పార్టీ వేగవంతం చేయడం ద్వారా ప్రజల మన్నలను అందుకునే ప్రయత్నం చేస్తుంది. మరి రానున్న ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరికి జై కొడతారో వేచి చూడాల్సి ఉంది.

