ఎంసెట్ పరీక్షకు మళ్లీ హల్ టికెట్లు
ఎంసెట్ (అగ్రికల్చర్,మెడికల్)రాసే అభ్యర్ధులకు మరోసారి హల్‌టికెట్లు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 14,15 తేదీల్లోనే ఎంసెట్(అగ్రికల్చర్,మెడికల్) పరీక్షలు జరగాల్సివుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ పరీక్షలకు బ్రేక్ పడింది.అయితే ఈ పరీక్షను ఈ నెల 30,31వ తేదిల్లో నిర్వహిస్తామన్న అధికారులు ఆ ప్రకారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు దాదాపు 90 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష తేదీలతో పాటు పరీక్ష కేంద్రాలు కూడా మారే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో విద్యార్ధులకు మరోసారి హల్ టికెట్లు జారీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ నెల 27 వ తేది నుంచి కొత్త హల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఎంసెట్‌ను ఉదయం,సాయంత్రం రెండు సెషన్ల చొప్పున నిర్వహించనున్నారు.
కాగా ఈ నెల 26న తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు.అయితే బీఈడీ కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షకు మొత్తం38,091 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షను మొత్తం మూడు సెషెన్లలో నిర్వహించనున్నారు.ఇందుకోసం మొత్తం 39 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు నుంచి జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలు ప్రారంభమయ్యాయి.ఈ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఈ పరీక్షలు ఈ నెల 25వ తేది నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 6,29,778 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు హజరయ్యారు.జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను జూన్ 23 నుంచి 30 తేదిల మధ్య నిర్వహించి,పరీక్షా ఫలితాలను కూడా వెల్లడించారు.ఈ నేపథ్యంలో మొదటి సెషన్‌లో సరిగ్గా స్కోర్ చేయని విద్యార్ధులకు మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్నాం అని అధికారులు తెలిపారు.