NationalNews

దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ఉప ఎన్నికల పోలింగ్‌

మునుగోడుతో సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. ఈ ప్రాంతాల్లో బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. తెలంగాణ, బిహార్‌ రాష్ట్రాల్లో ప్రచారం సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ బీజేపీని వదిలేసి మహా కూటమిలో చేరిన తర్వాత ఆ రాష్ట్రంలోని మొకామా, గోపాల్‌ గంజ్‌ అసెంబ్లీ స్థానాల్లో తొలిసారి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. హర్యానాలోని అడంపూర్‌లోనూ ఉప ఎన్నికకు పోలింగ్‌ జరుగుతోంది. రాష్ట్ర మాజీ సీఎం భజన్‌లాల్‌ కుటుంబానికి కంచుకోట అయిన అడంపూర్‌లో ఆయన చిన్న కుమారుడు కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నిక ఇది. కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి మారిన కుల్‌దీప్‌ మళ్లీ విజయానికి కృషి చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్‌ నియోజక వర్గంలో ఎమ్మెల్యే అరవింద్‌ గిరి మృతితో జరుగుతున్న ఉప ఎన్నికలో సిట్టింగ్‌ సీటును నిలబెట్టుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. బీఎస్పీ, కాంగ్రెస్‌ బరిలో లేకపోవడంతో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్యే ముఖాముఖి పోటీ నెలకొంది. ఎమ్మెల్యే బిష్ణు చరణ్‌ సేథీ మరణంతో ఒడిశాలోని ధామ్‌నగర్‌లోనూ ఉప ఎన్నిక అనివార్యమైంది. బిజూ జనతాదళ్‌కు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ముంబైలోని అంధేరీ ఈస్ట్‌ అసెంబ్లీ నియోజక వర్గంలో ఉప ఎన్నిక నుంచి బీజేపీ వైదొలగడంతో శివసేన విజయం నల్లేరుపై నడకే అని భావిస్తున్నారు. శివసేన చీలిక తర్వాత జరుగుతున్న తొలి ఉప ఎన్నిక ఇది.