NewsTelangana

మునుగోడుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం

Share with

మునుగోడుపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉప ఎన్నిక జరిగితే తాను కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేసేది లేదని కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. మునుగోడులో ఇటీవల నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఆవేదన చెందారు. తన పార్లమెంటు నియోజక వర్గంలో జరిగే సభకు తనకు కనీసం ఎస్‌ఎంఎస్‌ కూడా పంపించలేదని, పిలవని పేరంటానికి తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. ఆ సభలో అద్దంకి దయాకర్‌ తనను ఇష్టం వచ్చినట్లు తిట్టినా ఆయనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప్రశ్నించారు.

రేవంత్‌రెడ్డి ఐపీఎస్‌ అయితే.. భట్టి, ఉత్తమ్‌, శ్రీధర్‌ బాబు, తాను హోం గార్డులమా? అని నిలదీశారు. అద్దంకి మాటలకు రేవంత్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. తనను పార్టీ నుంచి బయటకు పంపించే కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే మునుగోడుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. సీనియర్‌ నేత జానారెడ్డి ఇంటికెళ్లిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మణిక్కం ఠాగూర్‌ తన ఇంటికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. సోనియా, రాహుల్‌గాంధీ వద్దే తేల్చుకుంటానన్నారు.