దద్దరిల్లుతున్న పార్లమెంటు ఉభయసభలు
వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఎటువంటి చర్చలు సరిగ్గా జరగకుండానే ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ధరల పెరుగుదల, జీఎస్టీ అమలు వంటి అంశాలు వరుసగా మూడో రోజు పార్లమెంటు ఉభయసభలను కుదిపేశాయి. సభాధ్యక్షుడు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. విపక్షాల ఎంపీలు ఎంత మాత్రం లెక్కచేయకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో ఎటువంటి చర్చలు జరపకుండానే ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. బుధవారం లోక్ సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలనులేవనెత్తారు. ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ప్లకార్డులను ప్రదర్శిస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దాంతో సభ్యులంతా ఆందోళన విరమించి ప్రశ్నోత్తరాలకు సహకరించాలన్నారు స్పీకర్. సభలో చర్చలు జరగాలి కానీ, నినాదాలు చెయ్యెద్దని చెప్పినప్పటికీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో సభలో నినాదాల హోరు తగ్గలేదు. అయితే పది నిమిషాల పాటు సభలో ప్రశ్నోత్తరాలను కొనసాగించినప్పటికీ….విపక్షాల ఆందోళనలతో సభ ముందుకు సాగలేదు.
ప్రజాసమస్యల ప్రస్తావనకు జీరో అవర్‌లో అవకాశం కల్పిస్తామని… స్పీకర్ చెప్పినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యహ్నం సభ ప్రారంభమయినప్పటికీ విపక్షాలు తమ ఆందోళనను అదే రీతిలో కొనసాగించాయి. అప్పటికీ స్పీకర్ స్థానంలో ఉన్న పి.వి.మిథున్ రెడ్డి సభ్యులంతా వారి స్థానాల్లోకి వెళ్లాలని… సభకు సహకరించాలని కోరినప్పటికీ ఎవరు వెనక్కి తగ్గలేదు. దీంతో సభను సాయంత్రం 4 గంటలకు వాయిదాపడింది. అనంతరం జీరో అవర్ ప్రారంభించినప్పటికీ విపక్ష సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించడంతో స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభ ప్రారంభించాక కూడా ఇదే తీరు కొనసాగడంతో అది ఒకసారి వాయిదా పడింది. అయితే మధ్యహ్నం సభ తిరిగి ప్రారంభమయ్యాక ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీల్లో కొందరు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు,వీడియోలు తీశారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటి చైర్మన్ హరివంశరాయ్ సభలో ఫోటోలు,వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్దం అని గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో జీఎస్టీ,ధరల పెరుగుదలపై చర్చ జరపకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు.