బ్రిటన్ ప్రధానిగా రిషి గెలవడం కష్టమేనా! ?
బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్ మరో అడుగు ముందుకేశారు. ఐదో రౌండ్‌లో రిషి 137 ఓట్లతో అగ్రస్ధానంలో నిలిచారు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు గరిష్ఠంగా 113 మంది మద్దతు పలికారు. వాణిజ్య శాఖ మంత్రి పెన్నిమోర్టంట్ 105 ఓట్లు రావడంతో రేసు నుంచి నిష్క్రమించారు. ప్రస్తుతం చివరి రౌండ్‌లో లిజ్ ట్రస్‌తో రిషి తలపడన్నున్నారు. చివరి రౌండ్‌లో ప్రధాని అభ్యర్థిని లక్షా 60 వేల మంది అర్హులైన కన్జర్వేటివ్ పార్టీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎన్నుకుంటారు. ఇలా కన్జర్వేటివ్ పార్టీ నేతగా విజయం సాధించిన వారే బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. ఓట్లను ఆగస్టు చివరి వారంలో లెక్కించి విజేత సెప్టెంబరు 5న ప్రకటిస్తారు.

కొత్త ప్రధానమంత్రి సెప్టెంబరు 7న పార్లమెంటులో అడుగుపెడతారు. ఐతే చివరి రౌండ్‌లో రిషి సునాక్ గట్టిపోటి ఎదుర్కొనున్నాడని సర్వే వెల్లడైంది. పార్టీ కార్యకర్తలైన టోరీ మెంబర్ల చేతుల్లో రిషి సునాక్ భవితవ్యం ఆధారపడి ఉన్నందువల్ల చివరి రౌండ్‌లో గెలుపు అంత సులభం కాదని తెలుస్తోంది. ఇటీవలి సర్వేల్లో టోరి మెంబర్స్ లిజ్ ట్రస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది. తాజా సర్వేలో పాల్గొన్న 725 మంది టోరీ సభ్యుల్లో 54 శాతం మంది ట్రస్ నెగ్గుతారని చెప్పగా 35 శాతం రిషిని సమర్థించారు. అయితే దీన్నిపెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని బ్రిటిష్ పరిశీలకులు అంటున్నారు. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో లేబర్ పార్టీని ఓడించగల నేతకే టోరీ సభ్యులు జై కొడతారని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. లేబర్ పార్టీని ఓడించే సత్తా రిషికే ఉందని… అందుకే ప్రస్తుతం ప్రధానిగా రిషినే ఎన్నుకోవాలని కొందరు చెబుతున్నారు.