దేశంలోనే అత్యధికంగా ఏపీలో సహజవాయువు నిక్షేపాలు
ఆంధ్రప్రదేశ్‌లో సహజవాయువు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలిపారు. ఇటీవల కాలంలో జరిగిన రాజ్యసభలో వైసీపీ సభ్యులు పి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రామేశ్వర్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో వెలికితీయవలసిన సహజ వాయువు నిక్షేపాలు సుమారు 27 క్యూబిక్ మీటర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా సహజ వాయువు వెలికితీతను ప్రోత్సహించటానికి ప్రభుత్వం అనేక నిర్ణయాలను తీసుకుంటుందని మంత్రి తెలిపారు. అదే విధంగా దేశంలో సహజ వాయువు ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణల గురించి ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే సహజ వాయువు ధరలను నిర్ధారించేందుకు 2014లో ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించిందన్నారు. హై ప్రెజర్-హై టెంపరేచర్ కలిగిన ప్రాంతాలలో ,అత్యంత లోతైన జలాల నుంచి వెలికి తీసే గ్యాస్ ధరలను ఒక పరిమితి దాటకుండా ఆపరేటర్లే నిర్ధారించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించిందన్నారు. అలాగే ఉత్పత్తి చేసిన సహజ వాయువును మార్కెట్ చేసుకునే స్వేచ్చను కూడా కల్పించినట్లు తెలిపారు. కోల్ బెడ్ నుండి ఉత్పత్తి చేసే మీథేన్ వాయువు ధరల నిర్ణయం,మార్కెటింగ్‌కు కూడా ప్రభుత్వం ఇదే స్వేచ్ఛను కల్పించిందన్నారు.
అలాగే ఆదేశాలకు మించి అధికంగా గ్యాస్‌ను వెలికి తీసే ఆపరేటర్లకు ప్రోత్సాహకం కింద 10% వరకు ప్రభుత్వం రాయాల్టీ మినహాయింపు కల్పించిందన్నారు.పెట్రోలియం,గ్యాస్ వెలికితీసే రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీని కేంద్ర ప్రభుత్వం సవరించే ప్రతిపాదన ఏమైనా ఉందా అన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రామేశ్వర్ సమాధానమిస్తూ..ప్రస్తుతానికి రాయాల్టీని సవరించే ప్రతిపాదన ఏమీ లేదని స్పష్టం చేశారు.అయితే 2003లో ప్రభుత్వ తీర్మానాన్ని అనుసరించి విలువను బట్టే రాయల్టీని నిర్ధారిస్తున్నట్లు మంత్రి తెలిపారు.ఈ మేరకు క్రూడాయిల్,గ్యాస్‌పై రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీని 2004లోనే సవరించినట్లు చెప్పారు.