వరద ప్రవాహంతో నిండు కుండలా ప్రాజెక్టులు
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దయ్యింది. గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఆ రాష్ట్రంలోని మూసీ ,సరస్వతీ ప్రాజెక్టులు మాత్రం వరద ప్రవాహంతో నిండు కుండను తలపిస్తున్నాయి. భారీగా ప్రవహిస్తున్న వరద నీరు ఆ ప్రాజెక్టుల పూర్తి స్థాయి నీటిమట్టానికి చాలా దగ్గరగా చేరడంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.అయితే మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 638.40 అడుగులకు చేరింది అలానే నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 2.86 టీఎంసీలకు చేరింది.దీనితో అధికారులు 4 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.అదే విధంగా జయ శంకర్ భూపలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజ్ కు కూడా వరద ప్రవాహం బాగా పెరగడంతో అక్కడ ఉన్న 66 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.