NationalNews

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి కాంగ్రెస్ మిత్రపక్షం మద్దతు….

Share with

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు జార్ఖండ్ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ మద్దతు ప్రకటించారు. మిత్రపక్షం కాంగ్రెస్, ఆర్జేడీలతో పాటు హేమంత్‌ సోరెన్‌ కూడా నిన్నా…మొన్నటి దాకా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా వెంటే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం 17 విపక్షాల ఉమ్మడి భేటీలో సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పుడు కూడా ఆ కార్యక్రమాల్లో హేమంత్ చురుగ్గా పాల్గొన్నారు. అలాంటిది ఆయన తాజాగా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించడం రాజాకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ముగ్గురు జేఎంఎం ఎంపీలు, 30 మంది ఎమ్యెల్యేలు ముర్ముకే ఓటేయాలని ఆదేశించారు. యశ్వంత్‌ సిన్హా జార్ఖండ్‌కు చెందినవారే అయిన ముర్ము వైపే హేమంత్ మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము జార్ఖండ్ వెళ్లారు. ఆ రోజు సీఎం సోరెన్ ఆమెకు ఘన స్వాగతం పలికారు.

స్వతంత్ర భారతదేశంలో తొలిసారి ఓ ట్రైబల్ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారని, అందుకే తమ పూర్తి మద్దతు ముర్ముకు ఉంటుందని జేఎంఎం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం కోసం యశ్వంత్ సిన్హా ఈరోజు జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. జేఎంఎం రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో సీఎం హేమంత్‌ సోరెన్ ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు మోదీ రావడానికి ఒక రోజు ముందే దేవ్‍ఘర్ వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దీంతో జేఎంఎం బీజేపీతో జతకడుతుందని, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంటుందనే ప్రచారం జోరందుకుంది.అయితే జేఎంఎం నాయకులు మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నారు. ప్రోటోకాల్‌లో భాగంగానే ప్రధానితో సీఎం వేదికను పంచుకున్నారనిపేర్కొన్నారు.జార్ఖండ్‌లో ట్రైబల్ ఓటర్లే చాలా కీలకం. జేఎంఎం కూడా పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంది. అందుకే మిత్రపక్షం కాంగ్రెస్‌కు విరుద్ధంగా ట్రైబల్ మహిళ ద్రౌపది ముర్ముకు మద్దతుగా నిలుస్తోంది.