టికెట్ కావాలంటే తిరగాల్సిందే
అమరావతి, మనసర్కార్
◆ వైసీపీ ఎమ్మెల్యేలలో మార్పు
◆ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి
◆ సొంత నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి పట్టుపై వేగంగా అడుగులు
◆ పూర్తి సమయం కేటాయిస్తూ ప్రతి గడప తొక్కుతున్న వైసీపీ శాసనసభ్యులు
◆ ఫలిస్తున్న సీఎం జగన్ వ్యూహం
ఆంధ్రప్రదేశ్ లో మరల తిరిగి అధికారం చేపట్టే విధంగా వైసీపి అధినేత వైయస్ జగన్ అడుగులు వేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ప్రజల్లో తమ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతను పోగొట్టే విధంగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ప్రారంభించారు. కానీ ఈ కార్యక్రమం ప్రారంభించిన తొలినాళ్లలో కేవలం సగం మంది ఎమ్మెల్యేలు మాత్రమే గడపగడపకు వెళ్లారు. వారిలో కూడా కొంతమంది మొక్కుబడిగా ప్రజల ముందుకు వెళ్లారు. మరో సగం మంది ఎమ్మెల్యేలు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వైపే మొగ్గుచూపులేదు. ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరిస్తే మరల అధికారంలోకి రావడం కష్టమని అభివృద్ధి పనులు జరగకపోవడంతో ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టటం కష్టమని జగన్ కు నివేదికలు అందడంతో ఈ విషయంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.

దీంతో జగన్ 45 రోజులకు ఒకసారి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై వర్క్ షాప్ నిర్వహిస్తూ వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లను బహిర్గతం చేస్తూ కష్టపడి పని చేయకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని కుండ బద్దలు కొట్టారు. ఇలా మూడు వర్క్ షాపులు నిర్వహించి వెనకబడిన వారి పేర్లను చదివి వినిపిస్తూ కష్ట కాలంలో నాతో పాటు నడిచినా కూడా ప్రజల్లో మంచి పేరు లేకపోతే ఎంతటి బలమైన నాయకుడికైనా టికెట్ ఇవ్వటం సాధ్యం కాదని స్పష్టం చేయటంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎమ్మెల్యేలలో చలనం వచ్చింది. నియోజకవర్గంలో తిరగకపోతే ప్రజల సమస్యల పరిష్కరించకపోతే టికెట్ రాదని ఫిక్సయిన ఎమ్మెల్యేలు వేగంగా అడుగులు వేస్తూ తమ తమ నియోజకవర్గాల్లో గడపగడప తొక్కుతున్నారు. పూర్తి సమయం నియోజకవర్గంలోనే గడుపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే పోటీపడి మరి గడపగడపకు వెళ్తున్నారు. దీంతో నిన్నటి వరకు వెనకబడిన వారే నేడు అగ్రస్థానంలో నిలవబోతున్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందుకోసమే అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిన్నటి వరకు ప్రభుత్వ పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలకు సమీక్ష సమావేశాలకు ఎక్కువ సమయం కేటాయించిన జగన్ తాజాగా పార్టీ కార్యక్రమాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రతినిత్యం పార్టీ వ్యవహారాల పైన ఆయా జిల్లాల ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ ఆయా జిల్లాల్లో పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించి వారికి సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.

వైయస్ జగన్ పార్టీ పై పూర్తిస్థాయి దృష్టి సారించడంతో ఎమ్మెల్యేలు , నాయకుల్లో కొత్త జోష్ మొదలైంది. రానున్న ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు కూడా జగన్ కసరత్తు చేస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీలో ఈసారి టికెట్ సాధించాలి అంటే గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రజల్లో తిరగాల్సిందేనని జగన్ హుకుం జారీ చేయటంతో ఆందోళనలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండటంతో కొంతమేర ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని విశ్లేషకులు కూడా అంటున్నారు.

