NewsTelangana

కాళేశ్వరం కల్లోలం కేసీఆర్ సృష్టేనన్న ఈటల

Share with

మొండివాడు రాజు కన్నా బలవంతుడంటారు. ఒకవేళ అలాంటి వాడే రాజైతే ఆ రాజ్యం తెలంగాణాలాగే ఉంటుంది. మిడిమిడి జ్ఞానంతో పాలకులు  తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ కష్టాలను ప్రజలు అనుభవించవలసి వస్తుంది.  ఇటీవలి కాలంలో రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాలను గురించి బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ తప్పిదం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఈ దుస్థితి పట్టిందన్నారు. కాళేశ్వరంలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునుగుతున్నాయన్నారు. అడ్డూ అదుపూ లేకుండా కాళేశ్వరం కోసం భూసేకరణ చేయడంతో అంచనాకు మించి పంట పొలాలు ముంపునకు గురయ్యాయన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న రూ.వేల కోట్ల విలువైన పంప్ హౌస్‌లు వరద నీటిలో మునిగిపోయాయని  అయినా, ఎంతో అనుభవం ఉన్న ఇంజినీర్లు సైతం ఎందుకు మాట్లాడటం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సీఎం కేసీఆర్ కూడా గతంలో తానే పెద్ద ఇంజనీర్‌ అని బిల్డర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇంజినీర్లు చెప్పినా సీఎం కేసీఆర్‌ పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.  రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు శ్రీరామరక్ష అని అనడంలో నిజం లేదని, వాస్తవానికి తెలంగాణ వచ్చాక మంచి వర్షాలు పడటం వల్లే పంటలు పండుతున్నాయి అని ఈటల పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మొదటిసారి మంథని, మంచిర్యాల పట్టణాలు మునిగిపోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు భయం భయంగా ఎప్పుడేం జరుగుతుందో అని జీవిస్తున్నారన్నారు ఈటల. ఒక్కొసారి ముంపునకు గురైతే.. పదేళ్లు అయినా కోలుకోలేరన్నారు. పొలాలు నీటిలో మునిగి పోయి… నదిలో కలిసిపోయి దిక్కుతోచని స్థితిలో బాధితులు ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదాలు ఉంటాయన్నారు. ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ బాధ్యత లేకుండా విదేశాలకు వెళ్లారన్నారు.  నీటిపారుదల శాఖ సీఎం పరిధిలో ఉందని…  ప్రజలకు ప్రభుత్వం ఆసరా  కల్పించాల్సి ఉందన్నారు. వేల కోట్ల నష్టం వాటిల్లితే చోద్యం చూస్తున్నారన్నారు. ఇంజినీర్లు శాశ్వత చర్యల గురించి ఆలోచన చేయాల్సి ఉందన్నారు. అధికారులు సరిగా పని చేయడం లేదని… 139 టీఎంసీల నీరు ఎత్తిపోస్తే రూ.3వేల కోట్ల కరెంట్ బిల్లు వచ్చిందని ఈటల విమర్శించారు. కాళేశ్వరానికి ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవ తప్పిదం కూడా కలిసిందని విశ్రాంత ఇంజనీర్ల ఫోరం అధ్యక్షుడు శ్యాం ప్రసాద్ అన్నారు. ప్రాజెక్టు సరిగా పని చేయడంలేదని, చేవెళ్ల వయబుల్ కాకపోతే కాళేశ్వరం కూడా కాదని, లిఫ్ట్‌లు మూడు స్టేజీలు దాటితే వయబుల్ కాదని స్పష్టం చేశారు. అన్నారం పంపింగ్ 130 మీటర్ల వద్ద ఉంటే వరద 131 మీటర్లకు చేరడం వల్లే మంథని పట్టణంలోకి నీళ్లు వచ్చాయని శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు.