కేసీఆర్‌కు డీకే అరుణ స్ట్రాంగ్ వార్నింగ్
సీఎం కేసీఆర్ వరద బాధితులను ఇంకెప్పుడు పట్టించుకుని తక్షణ సాయం అందిస్తారని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రి తీరిక లేదని..నామా మాత్రంగా ఒక్క రోజు మాత్రమే పర్యటించారన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు విషయంలో కమిషన్లకు కక్కుర్తిపడి..సీఎం చేసిన నిర్వాకానికి తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నాన్నారు.
అదే విధంగా కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల పరివాహక ప్రాంతాలలోని ప్రజలు ప్రతి ఏటా ముప్పునకు గురవుతున్నారన్నారు. దీనివల్ల అక్కడి ప్రజలు తమకు ఉన్న సమస్తం కోల్పోతున్నారని వాపోయారు. ఇటీవల తాను మంచిర్యాల,పెద్దపల్లి జిల్లాల్లో పర్యటన చేసినప్పుడు ప్రజలు కన్నీటి పర్యంతం అవ్వటం చూసి తనకు చాలా బాధగా అనిపించిందన్నారు.ఇంతకు ముందు జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసినట్లుగా కాకుండా,ఈ సారి నష్టపోయిన వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని ఆమె సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు.