Andhra PradeshHome Page Slider

వివేక హత్య కేసు విచారణ నేపథ్యంలో కడపపై జగన్ ఫోకస్

వివేక హత్య విచారణ నేపథ్యంలో జగన్ అలర్ట్
అవినాష్, భాస్కర్ రెడ్డిల కేసులు ప్రభావంపై నజర్
రానున్న ఎన్నికలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు
పట్టు సడలకుండా మార్గాలు అన్వేషణ

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనాపరంగా రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా తన సొంత జిల్లా కడపలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎంపీ అవినాష్ రెడ్డి కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిలు సిబిఐ కేసుల నేపథ్యంలో ఎక్కువ సమయం హైదరాబాద్‌లోనే ఉండాల్సి రావడంతో పాటు కేసు చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో పట్టు సడలకుండ జగన్ ప్రత్యేకంగా దృష్టిస్తారిస్తున్నారు. ఇప్పటివరకు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు అండగా ఉంటూ వారి ఆధ్వర్యంలోనే జిల్లాలో పార్టీ పరంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రత్యేకించి సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని వైఎస్ భాస్కర్ రెడ్డి పర్యవేక్షిస్తూ అక్కడి నాయకులకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు.

అయితే కేసుల నేపథ్యంలో ఇప్పటికే భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటం అవినాష్ రెడ్డిని సిబిఐ వారం రోజులు పాటు విచారిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ కడప పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. పార్టీ వర్గాల్లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సొంత జిల్లాలో పట్టు చేజారి పోకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయంగా ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా సీఎం జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ కేసులో తమకు న్యాయం జరుగుతోందని జగన్ భరోసాగా ఉన్నప్పటికీ మరోవైపు కేసు విచారణ పూర్తికి దగ్గరవుతున్న కొద్ది వైసీపీ నేతల్లో తెలియని ఆందోళన కనిపిస్తుంది. ఒకవేళ ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కడప జిల్లా పరిస్థితి ఏమిటి ఒకవేళ అదే పరిస్థితి ఎదురైతే అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం కోసం పరుగులు తీయడం కంటే ఇప్పటినుండే ఆదిశగా ఏర్పాటు చేసుకోవడం మేలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ కూడా అదే ఆలోచనతో కడపపై కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. సిబిఐ కేసులో ఏదైనా ఊహించరానిది ఎదురైతే అప్పటికప్పుడు ఇబ్బందులు పడటం కంటే ఇప్పుడే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని కడప జిల్లాలోని బలమైన నేతలను నియమిస్తే బాగుంటుందని ఆరా తీస్తూ పలువురు పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే సొంత కుటుంబానికి చెందిన వారికే తిరిగి కడప జిల్లా బాధ్యతలను అప్పగించాలని ఉద్దేశంతోనే జగన్ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఇద్దరు పేర్లను పరిశీలించి వారితో చర్చించినట్లు కూడా చెబుతున్నారు. మరో వారం రోజుల్లో ఈ వ్యవహారంపై సీఎం జగన్ అధికారికంగా ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.