Home Page SliderTelangana

బోధన్‌లో ఈసారి పట్టం ఆ పార్టీకేనా?

2014కు రాష్ట్ర విభజనకు ముందు హస్తం పార్టీ హవా ఉన్న బోధన్‌లో ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతగా ఉన్న సుదర్శన్ రెడ్డి వరుస హాట్రిక్ విజయాల తర్వాత గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే మరోసారి గెలిచి సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. గతంలో కీలక శాఖలకు మంత్రిగా చేసిన సుదర్శన్ రెడ్డి గెలుపు ఈసారి నల్లేరుపై నడకేనన్న భావనతో ఉన్నారు. అయితే ఇక్కడ్నుంచి బీజేపీ నుంచి మోహన్ రెడ్డి పోటీకి నిలిపింది. మైనార్టీ ఓట్లు ప్రముఖ పాత్ర వహించడం ద్వారా మరోసారి విజయం సాధించాలని షకీల్ భావిస్తున్నారు. మరోసారి విజయం సాధించి హాట్రిక్ కొట్టాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ప్రభుత్వంలోనూ కీలక అవకాశాలు లభిస్తాయని ఆశపడుతున్నారు.

బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 246 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 1,03,577, స్త్రీ ఓటర్లు 1,12,381 ట్రాన్స్‌జెండర్లు 5, మొత్తం ఓటర్లు 2,15,963 ఉన్నారు. బోధన్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు కీలక భూమిక పోషిస్తారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీకి గంపగుత్తగా సహకరిస్తున్నవారు ఇప్పుడు ఎవరికి మద్దతిస్తారన్నదానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఓటర్లు 20 నుంచి 22 శాతం వరకు ఉన్నారు. కమ్మ ఓటర్లు ఇక్కడ 10 శాతానికి పైగా ఉన్నారు. ముదిరాజ్‌లు 10 శాతం, మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం, మాదిగలు 9 శాతం, గౌడ్‌లు 8 శాతం, మాల ఓటర్లు 6 శాతానికి పైగా ఉన్నారు. యాదవులు నాలుగున్నర శాతం, రెడ్లు నాలుగున్నర శాతం మేర ఉండగా, లింగాయత్‌లు సైతం ఇక్కడ మూడు శాతానికి పైగా ఉన్నారు. ఇతరులు 15 శాతం మేర ఉన్నారు.