InternationalNews

హిజాబ్‌పై ఇరాన్‌ మహిళల  తిరుగుబాటు

మతాచారాలను పకడ్బందీగా అమలు చేసే ఇరాన్‌లో మహిళలు హిజాబ్‌పై తిరుగుబాటు ప్రకటించారు. పలువురు మహిళలు జుట్టును కత్తిరించుకొని, హిజాబ్‌లను కాల్చేసి ఆందోళనకు దిగారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ సహా పలు నగరాల్లో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఆందోళనలకు కారణమేంటి..?

హిజాబ్‌పై కఠిన నిబంధనలు..

ఇరాన్‌లో ఏడేళ్లు దాటిన అమ్మాయిలు డ్రెస్‌కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. జుట్టును పూర్తిగా కప్పేసేలా హిజాబ్‌ ధరించాలి. హిజాబ్‌ చట్టాన్ని ఉల్లంఘించిన మహిళలను అరెస్టు చేస్తారు. జరిమానా కూడా విధిస్తారు. ఇలాంటి కఠిన నిబంధనలను ఈ ఏడాది జూలై నెలలో దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ జారీ చేశారు. ఈ నిబంధనల పర్యవేక్షణకు, శిక్షలు విధించేందుకు ‘మొరాలిటీ పోలీసు’ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

22 ఏళ్ల మహిళ మృతి..

హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదన్న నెపంతో ఇటీవల మహ్సా అమిని అనే 22 ఏళ్ల మహిళను మొరాలిటీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. పోలీసు కస్టడీలోనే గుండెపోటుకు గురైన ఆ మహిళ కోమాలోకి వెళ్లిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు చిత్రహింసలకు గురి చేయడం వల్లే అమిని మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపించారు. దీంతో ఇరాన్‌ మహిళలు ఆగ్రహంతో రోడ్డెక్కారు.

వివక్షపూరిత చట్టాలు మాకొద్దు..

మహిళలను అణిచివేసేందుకే కొత్త చట్టాలను తీసుకొస్తున్నారంటూ వినూత్న నిరసనను ప్రారంభించారు. హిజాబ్‌ను తొలగించి జుట్టును కత్తిరించుకున్నారు. రోడ్లపై హిజాబ్‌ను కాల్చి నిరసన చేపట్టిన వీడియోలను వైరల్‌ చేశారు. ‘ఏడేళ్ల వయస్సు నుంచి హిజాబ్‌ ధరించకుంటే స్కూళ్లలో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వివక్షపూరిత ఈ చట్టాలతో విసిగిపోయాం. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని మహిళలు నినదించారు.