‘అతని హత్యను బీఆర్‌ఎస్‌కు అంటగడుతున్నారు’..మాజీ ఎమ్మెల్యే
మేడిగడ్డ బ్యారేజి కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి అనే వ్యక్తి బుధవారం హత్యకు గురికావడం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ ఘటనలో పూర్తి విచారణ జరపాలని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్‌ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే గండ్రం వెంకటరమణారెడ్డి దీనికి కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు, కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనితో గండ్రం వెంకటరమణారెడ్డి స్పందించారు. తనకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై, బీఆర్‌ఎస్ పార్టీపై ఈ హత్య చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, బీఆర్‌ఎస్‌కు అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. మృతుడి భార్య గతంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా ఉందని, విధానాలు నచ్చక పార్టీ దూరం పెడితే, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజలింగమూర్తి అనేక భూ వివాదాలలో కూరుకుపోయారని, రౌడీషీటర్‌గా ఉన్నాడని, హత్య కేసు నిందితులను కనిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

