Home Page SliderTelangana

దిక్కులు పిక్కటిల్లేలా జుక్కల్‌ పోరు

జుక్కల్ ఎస్సీ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనట్టుగా ఈసారి పోటీ కన్పిస్తోంది. జుక్కల్ సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మరోసారి విజయం సాధించేందుకు శక్తులన్నీ ఏకం చేసుకుంటున్నారు. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన హన్మంత్ షిండే… 2014, 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి విజయం సాధించారు. వరుస విజయాలతో హాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డుల్లోకెక్కారు. భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ, జిల్లా రాజకీయాల్లోనూ, పార్టీలోనూ గుర్తుంపు పొందారు. అయితే ఈసారి షిండేకు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు గట్టి పోటీ ఇస్తుంటే, మాజీ ఎమ్మెల్యే అరుణతార సైతం బీజేపీ నుంచి రేసులో నిలిచారు. గతంలో టీడీపీ నుంచి విజయం సాధించిన అరుణతార మారిన రాజకీయ పరిస్థితులతో బీజేపీలో కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో జుక్కల్ జెండా ఎగురేస్తామని మూడు పార్టీల నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

జుక్కల్ ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలింగ్ బూత్‌లు 255 ఉండగా, పురుష ఓటర్లు 97,618, స్త్రీ ఓటర్లు 1,00,269 ట్రాన్స్ జెండర్లు 10 మంది ఉండగా, మొత్తం ఓటర్లు 1,97,897 ఉన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో మాదిగలు 10 శాతానికి పైగా ఉన్నారు. వారి తర్వాత మున్నూరు కాపులు అంతే సంఖ్యలో 10 శాతానికి దగ్గరగా ఉన్నారు. ముదిరాజ్‌, మాల సామాజికవర్గాలు తొమ్మిదేసి శాతం మేర ఉన్నారు. ముస్లింలు ఎనిమిదిన్నర శాతం, గౌడలు ఐదున్నర శాతం, లంబాడ 5 శాతం, మరాఠాలు 5 శాతం, వైశ్యులు, లింగాయత్ నాలుగున్నర శాతం మేర ఉన్నారు. ఇతరులు 30 శాతం వరకు ఉన్నారు.