Andhra PradeshNews

తెలంగాణలో ఇస్తున్నట్టుగా పదివేలు ఇవ్వాల్సిందే-చంద్రబాబు

Share with

శ్రీలంక ప్రజలతో పోలిస్తే… ఏపీ ప్రజలకు ఓర్పు ఎక్కువన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దేశంలోనే అధిక ధరలకు ఏపీ చిరునామాగా నిలిచిందని… బాదుడే బాదుడుతో ప్రజలను పీల్చుకుతుంటోందని విమర్శించారు. మరోవైపు వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా కుటుంబానికి పది వేల రూపాయల సాయం అందించాల్సిందేనన్నారు. ప్రజలను వరదల్లో ముంచేసి సీఎం హెలికాప్టర్ల టూర్లేంటని ఆయన ప్రశ్నించారు. ముంపు ప్రాంత బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు… వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఏపీ మరో శ్రీలంక కాదనీ , శ్రీలంకలో ఉన్న పరిస్ధితులు ఇప్పటికే  ఏపీలో ఉన్నాయని మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు అన్నారు. పదవీ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన పెన్షన్‌లు కూడా  సరిగా ఇవ్వడం లేదని , జీపీఎఫ్ కూడా విత్‌డ్రా చేసుకునే పరిస్ధితి ఉద్యోగులకు లేకుండా చేశారని విమర్శించారు.

కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేని స్దితిలో పరిపాలన జరుగుతుందన్నారు. ఏపీని ఇంకా అప్పుల్లోకి తోసేలా చేసి, అప్పులను తీర్చేందుకు ఇంకా అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్ల మరమత్తుల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని , ఈ పరిస్ధితులన్నీ శ్రీలంక లాంటి పరిస్దితులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్లక్షం ఎవరిదో అని ప్రశ్నించిన చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తమ వైఫల్యాలను దాచుకునేందుకే తమ పార్టీపై ఎదురుదాడి చేస్తోందన్నారు.