అధికారంలోకి వస్తే పోలవరం జిల్లా ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం కేంద్రంగా రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. పోలవరం ముంపు గ్రామాల్లో .. విలీన మండలాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే పోలవరం పేరుతో జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
గతంలో పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఏపీలో విలీనం చేసుకున్నారు. ఈ మండలాలు ఏలూరు జిల్లా, అల్లూరి జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటున్నారు చంద్రబాబు. పోలవరం ప్రాజెక్ట్ ను జగన్మోహన్ రెడ్డి నిండా ముంచారని ఆరోపిస్తున్నారు. సాఫీగా సాగిపోయే ప్రాజెక్ట్ జగన్ నిర్వాకం వల్ల ఆగిపోయే పరిస్థితి వచ్చిందని.. కనీసం సహాయ, పునరావాసానికి నిధులు తెచ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు భద్రాచలంలో గోదావరి కరకట్టను పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని గుర్తు చేసుకున్నారు. మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉండిపోతాయని, ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే 2 వేల రూపాయల ఆర్థిక సాయంతో బాధితుల కష్టాలు తీరవని చెప్పారాయన. జగన్ పోలవరం కట్టలేనని చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు కూడా ఒకసారి బటన్ నొక్కలన్నారు. కుట్రలు, కుతంత్రాలు తప్ప జగన్‌కు మరొటి తెలీదని మండిపడ్డారు