Home Page SliderTelangana

త్వరలో కాంగ్రెస్ గూటికి మాజీ డిప్యూటీ సీఎం మంత్రి రాజయ్య?

మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య రూటే సెపరేట్. నాడు అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవి లభించినా.. అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. స్వయంకృతం కొంత, పరిస్థితుల ప్రభావం కొంత ఆయనను తిరిగి ఎమ్మెల్యేగా మార్చేశాయ్. విమర్శలెన్ని రేగినా.. తిరిగి టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు గత ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ నిరాకరించారు. వివాదాలు చుట్టూ తిరిగి రాజయ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ తనకు అన్యాయం చేశారన్న కారణాన్ని హైలెట్ చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నారు.

ఎక్కడికీ వెళ్లడం లేదు… దేంట్లోనూ చేరడం లేదు.. అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమన్నారు మాజీ మంత్రి తాటికొండ రాజయ్య. ఆరు నెలలుగా పార్టీలో జరిగిన పరిణామాలు తనతోపాటు, తనను నమ్ముకున్న కార్యకర్తలను మానసికవేదన మిగిల్చాయన్నారు. అనేక సందర్భాల్లో కార్యకర్తలు బాధను వ్యక్తం చేశారని చెప్పారు. ఐతే , పార్టీని గౌరవిస్తూ.. అప్పగించిన బాధ్యతను నిర్వర్తించానన్నారు. తన నియోజకవర్గం ఘన్‌పూర్ ఎమ్మెల్యేను, ఇన్ చార్జిగా ఉన్న జనగాంలోనూ… ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానన్నారు. జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ గెలిచిన రెండు స్థానాల్లోనూ తాను పనిచేశానన్నారు. ఇది తన నిబద్ధత వల్ల జరిగిందన్నారు. తనకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకపోవడంపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.

తాను ఎంతగానో పార్టీ కోసం పని చేసినా… పార్టీలో గుర్తింపు లేదన్నారు. స్థానిక నాయకత్వం నుంచిగానీ, అధిష్టానం నుంచి గానీ తనకు గుర్తింపు లభించలేదన్నారు. అప్రజాస్వామికంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేస్తామని.. 6 నెలల్లో సీఎం కేసీఆర్ అవుతాడని.. బీఆర్ఎస్ 39, 7 మజ్లిస్, 8 బీజేపీ ఎమ్మెల్యేలున్నారని… ప్రభుత్వ ఏర్పాటు పెద్ద కష్టమే కాదని స్థానిక నాయకులు మాట్లాడటం దారుణన్నారు. ప్రతిపక్షంలో ఉంటే ఎమ్మెల్యేలం కామా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ విధివిధానాలు నచ్చడం లేదన్నారు. 15 ఏళ్లు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న ఆయన తెలంగాణ కోసమే బీఆర్ఎస్ పార్టీలో చేరానన్నారు. ఎన్నికల్లో గెలిచినవారు ఘన్‌పూర్‌లో కన్పించడం లేదని.. త్వరలోనే అనుచరులు, అభిమానులను కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాంగ్రెస్ పార్టీని కూల్చి… అధికారం పొందాలని కొందరు చూస్తున్నారని… అందుకే తాను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నానని రాజయ్య చెప్పారు. తాను తీసుకునే నిర్ణయం ప్రజలపక్షమే ఉంటుందన్నారు. పార్టీ హైకమాండ్ అప్పుడూ, ఇప్పుడూ కూడా తనకు విలువ ఇవ్వలేదని.. అసలు భిప్రాయాన్ని వినే పరిస్థితి కారు పార్టీలో లేదన్నారు. పార్టీ అధినాయకత్వం నుంచి పిలుపురానందునే తాను గుస్సాగా ఉన్నానన్నారు. తెలంగాణ అంతటా తనకు కార్యకర్తల బలం, అండ ఉందని… తెలంగాణ ఉద్యమ సమయంలోగానీ, ఎమ్మార్పీఎస్ కార్యకర్తగా గానీ తెలంగాణ అంతటా తిరిగి.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చానన్నారు.

తెలంగాణలోని దళిత నాయకులు, నియోజకవర్గ నాకులతో మాట్లాడి త్వరలో నిర్ణయం తీసుకుంటానన్నారు తాడికొండ రాజయ్య. 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్న ఆయన ఆ వైపు చూస్తు్న్నట్టుగా కన్పిస్తోంది. నాడు తెలంగాణ కోసం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకతో మాట్లాడానన్నారు. సందర్భం వచ్చినప్పుడు పార్టీ మారతానని రాజయ్య… ఏ పార్టీలోకి వెళ్లబోతుంది చెప్పకనే చెప్పారు. త్వరలోనే హస్తం గూటికి చేరతానన్న సంకేతాలిచ్చారు రాజయ్య. రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరి వరంగల్ ఎస్సీ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముందని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వరంగల్ లో వేవ్ ఉందని భావిస్తున్న రాజయ్య ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నారు.