హైదరాబాద్‌లో కుండపోత… శనివారం వరకు వర్షాలే.. వర్షాలు…
రాజధాని హైదరాబాద్‌లో రెండ్రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. అంతలోనే పొడి వాతావరణం. అంతలోనే భారీ వర్షం కురుస్తోంది. ఏ క్షణాన ఎలాంటి వెదర్ ఉంటుందో అర్థం కానట్టుగా పరిస్థితి నెలకొంది. తాజాగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆరెంజ్, ఎల్లో వార్నింగ్ హెచ్చరికలను వాతావరణ శాఖ జారీచేసింది. బుధవారం రోజంతా వర్షం కురిసింది. కొద్దిపాటి వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం వరకు వర్షాలు ఇదేలా కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేయడంతో… హైదరాబాద్ గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ఆటంకాలు కలక్కుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో రెండు మూడు గంటల పాటు ఆగకుండా వర్షం కురవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. భారీగా ట్రాఫిక్ ఏర్పడటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు వెదర్ డిపార్టమెంట్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.


