NewsNews AlertTelangana

తెలంగాణలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు

Share with

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వర్షాలతో జన జీవనం స్తంభించిపోతోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. రాగల 2 రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మొదటి రోజు 12 సెం.మీ. నుంచి 20 సెం.మీ. వరకు, రెండో రోజు 20 సెం.మీ. పైనే వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఏపీ కోస్తా తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీంతో పాటు విదర్భ నుంచి తెలంగాణ వరకు సగటు 0.9 కి.మీ.ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. 7వ తేదీ లేదా ఆ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.