Home Page SliderNationalNews Alert

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి : కేంద్రం కీలక సూచన

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచమంతటా అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం చైనాను పూర్తిగా చుట్టేస్తోంది. చైనా, అమెరికా, సహా పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ దేశాల్లో వైరస్‌ పరిస్థితులపై అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. ఇకపై కరోనా పరిస్థితులను చర్చించి చర్యలు తీసుకొనేందుకు ప్రతివారం ఈ ఉన్నత స్థాయి కమిటీ భేటీ కావాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నిర్ణయించారు.

ప్రపంచ దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్న వేళ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, నిఘాను మరింత కట్టుదిట్టం చేయాలని మన్‌సుఖ్‌ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు కేవలం 27-28 శాతం మంది మాత్రమే అర్హులైనవారు బూస్టర్‌ డోసు వేసుకున్నారని.. అర్హులైన ప్రతి ఒక్కరూ వేసుకోవాలని సూచించారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారంతా తప్పసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. అంతర్జాతీయ విమాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఇంకా ఎలాంటి మార్పులు లేవన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశంలో నీతి అయోగ్‌ సభ్యులు, ఇతర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆరోగ్య, ఆయుష్‌, ఔషధ, బయోటెక్నాలజీ విభాగాల అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలపై దృష్టి సారించింది.