అసెంబ్లీలో ప్రజాగళం విన్పించిన ఒకే ఒక్కడు ఈటల
బలాలు, బలహీనతలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. కాకుంటే ఆ బలం కొందరి అధికారం వస్తే కన్పిస్తుంది. కొందరికి ప్రజల్లో ఉంటే తెలుస్తోంది. అలాంటి అరుదైన నాయకుల్లో ఒకే ఒక్కడు, తెలంగాణ ముద్దుబిడ్డ, బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీలో అవమానంతో బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్ నాటి నుంచి నేటి వరకు విశ్రమించలేదు. ఏ లక్ష్యంతోనైతే తాను బీజేపీ చేరారో అదే లక్ష్యం కోసం అనునిత్యం పనిచేస్తున్నారు. ప్రజాసమస్యలను పరిష్కారంలోనే తనకు సంతృప్తి అని భావించిన ఈటల రాజేందర్ గడిచిన పాతికేళ్లుగా అదే పంథాను అనుసరించారు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని ధీరుడిగా ఉన్న ఈటల టీఆర్ఎస్ వ్యూహాల లొసుగులు తెలిసిన ఒక్కడిగా తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు.

ఆధిపత్య వ్యవహారాన్ని పులుముకున్న కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా… ఈటల తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం అహరహరం పనిచేస్తున్నారు. పార్టీ కోసం తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాలను తూ.చ తప్పకుండా పాటిస్తున్నారు. రాజకీయంగా ఎవరూ అందుకోలేని వ్యక్తిత్వం ఈటలది. రాజకీయ ఆరంభం నుంచి నేటి వరకు విలువలు, విశ్వసనీయత ఆభరణంగా ముందుకు సాగుతున్నారు. కబ్జా మంత్రి అంటూ కేసీఆర్ సర్కారు సొంత ఇంట్లోని నిఖార్సయిన వ్యక్తిత్వానికి పొగబెట్టి, బయటకు పంపించినా.. ప్రజల గుండెల్లో ఆయన స్థానం పదిలమని రుజువయ్యింది. ఈటల లాంటి సచ్ఛీలుడిపై కేసీఆర్ దమననీతి ఎలా సాగించారో… ఒక్క తెలంగాణ సమాజం కాదు.. యావత్ దేశమంతా చూసింది. నచ్చితే పాలకులు ఎలా చేస్తారు.. నచ్చకుంటే ఏం చేస్తారు.. రాజకీయంగా అడ్డు ఎలా తొలగించుకుంటారనడానికి ఈటల ఎపిసోడ్ ఉదాహరణ. కేంద్రంపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ పాలకులను అసెంబ్లీలో ఓ ఆట ఆడుకున్నారు ఈటల.
తాజాగా అసెంబ్లీలో ఈటల మోహం చూడొద్దని ఏడాదిగా కేసీఆర్ సర్కారు సాగించిన అరాజకీయాన్ని అందరూ చూశారు. ఈటలను మాట్లాడనిస్తే ఏమవుతుందోనన్న కంగారులో ఉన్న సర్కారు.. తాజాగా ఈటలను అవమానించే వ్యూహంతో వచ్చింది. అయితే ప్రజాభిమానమే శ్రీరామరక్షగా భావించే… రాజేందర్ సకల జనుల సమస్యలపై మాట్లాడుతుంటే.. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలు ఒకడున్నాడురా మన కోసం అనుకునేలా వాతావరణ మారిపోయింది. ప్రజల ఆకాంక్షను అసెంబ్లీలో విన్పించి.. మన కోసం మాట్లాడేవాళ్లున్నారురా అనుకునేలా ప్రజాగళాన్ని విన్పించారు ఈటల. సమాజంలోని సకల జనులకు ఎదురవుతున్న అనేక సమస్యలను పూసగుచ్చి మరీ విన్పించి.. అసెంబ్లీలో దటీజ్ ఈటలని శభాష్ అన్పించుకున్నారు. ఇలాంటి వాదన విని చానాళ్లయ్యినట్టుగా ఉందే అనేలా ప్రభుత్వ పెద్దలు అసూయపడేలా రాజేందర్ ప్రసంగాలు ఉండటం విశేషం.
గులాబీ పార్టీ కోసం అను నిత్యం పనిచేసి.. అవమానభారంతో జాతీయ పార్టీలో చేరిన ఈటల.. తన సత్తా ఏంటో చూపించేందుకు హుజూరాబాద్ వేదికగా మలచుకున్నారు. ఎన్నికల్లో గులాబీ పార్టీ అధికార దుర్వినియోగంతో, వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, వేల కోట్ల రూపాయలతో పథకాలు తెచ్చిన, దళితబంధు లాంటి మెగా స్కీమ్ తెచ్చినా.. ప్రజలు ఈటలనే నమ్మారు. హుజూరాబాద్ సౌండ్ తెలంగాణ అంతటా ప్రతిధ్వనించింది. అప్పటి వరకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, మూడో స్థానానికి పరిమితమైతే.. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీయేనన్న భావన కలిగించింది. హుజూరాబాద్ ఇచ్చిన బలంతో బీజేపీ పెద్దలు ఏకంగా హైదరాబాద్‌లో జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించారనుకునేటట్టుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

అసెంబ్లీలో ఈటల జపం చేసిన కేసీఆర్, ఆయనను వశపర్చుకోవాలని.. తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారని కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చినా… వాటన్నింటినీ ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రాజకీయాలు ప్రజల కోసం, పేదల కోసం, సకల జనుల సమస్య కోసం అని నినదించే ఈటల తాను భారతీయ జనతా పార్టీలోనే ఉంటానని.. అదే రాజకీయ జీవితమని పునరుద్ఘాటించారు. ఏనుగు పోతుంటే… కుక్కలు మొరిగితాయన్నట్టుగా.. రాజకీయ రచ్చ చేయడం ద్వారా తగ్గేది ఎవరి విలువో వేరే చెప్పనక్కర్లేదన్న సామెత ఈటల విషయంలో వందకు వంద శాతం నిజం.

