ఈవీఎంలపై కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్
రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తేనేమో ఎలక్షన్ కమిషన్ బాగా పనిచేసినట్లు, ప్రజాస్వామ్యం గెలిచినట్లు అంటున్నారు. కానీ కేంద్రంలో తన పార్టీ ఓడిపోతే, అధికారంలోకి రాకపోతే EVM లను నిందిస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ను నిందిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్నారు అంటే ఎంత ద్వంద్వ వైఖరి ఉందో అర్థమవుతుంది.
దేశంలో ఉన్న కోర్టులు, ప్రజాస్వామ్యం, రాజకీయాల మీద, ఎన్నికల కమిషన్ మీద, ప్రజల మీద కూడా విశ్వాసం లేని వ్యక్తి రాహుల్ గాంధీ. కాబట్టే ఇక్కడ మాట్లాడే దమ్ము లేక ఎక్కడో విదేశాలకు వెళ్లి భారతజాతి ఆత్మ గౌరవాన్ని కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ ఇది మంచిది కాదు. మీకు దేశం పట్ల ఎలాంటి వైఖరి ఉందో మీ మాటల్ని పట్టి అర్థమవుతుంది. భారత పౌరులు లండన్, అమెరికా, దుబాయి, ఎక్కడ ఉన్నా గల్లా ఎగరేసి నేను భారతీయుడినీ అని చెప్పే స్థాయికి ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా భారత జాతి ఆత్మ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తూంటే, భారతజాతి ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి రాహుల్ గాంధీ” అని విమర్శించారు ఈటల.