NationalNewsNews Alert

మెజారిటీ ఉంటేనే పార్టీగుర్తు

Share with

మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. శివసేనలో చీలికలు ఏర్పడి గ్రూపులుగా విడిపోయిన తర్వాత శివసేన పార్టీ నాయకులెవరనేది తేలాల్సి ఉంది. నాయకత్వ హక్కుల కోసం మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య పంచాయితీ ఇప్పుడు ఎన్నికల సంఘానికి చేరింది. శివసేన పార్టీ మాదంటే మాదేనని రెండు పక్షాలు కోర్టు మెట్లెక్కాయ్. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గం… తమదే అసలైన శివసేన తమదేనంటూ… పార్టీనియంత్రణను అప్పగించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. 40 మంది ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్‌ శిండే తిరుగుబాటుతో ఈమధ్య ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీ మద్దతుతో శిండే ముఖ్యమంత్రి అయ్యారు.

ఇటీవల లోక్‌సభలో కూడా శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 12 మంది శిండే వర్గంలో చేరడంతో చీలిక వర్గానికి బలం ఎక్కువయ్యింది. దీంతో అసలైన శివసేన తమదేనంటూ శిండే వర్గం ఈసీకి లేఖ రాస్తూ, పార్టీ గుర్తు, విల్లు-బాణం తమకే కేటాయించాలని కోరుతోంది. ఇదే విషయంపై ఉద్ధవ్ వర్గం కూడా తమకే పార్టీనాయకత్వం అంటూ లేఖ రాసింది. శివసేనలో కొందరు పార్టీ వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని… తమ పార్టీగుర్తు తమకే కేటాయించాలని పేర్కొంది. ఈ విషయంలో ఇరుపక్షాల అభ్యర్థనలను విన్న  ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం మెజారిటీ నిరూపించుకోవాలని, అందుకు కావలసిన పత్రాలను ఆగస్టు 8వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించింది. పార్టీలో విభేదాలపై పూర్తి వివరణ కూడా కోరింది. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు వివాదం తేలకపోతే, ఇరు వర్గాలకు తాత్కాలికంగా పేర్లు, గుర్తులు కేటాయించే అవకాశాలున్నాయి. రాజ్యాంగ కమిటీ దీనిపై విచారణ చేయించి, నిర్ణయించవచ్చని, ఈసీ తెలిపింది.