సీఐడీ కళ్లుగప్పి తప్పించుకున్న వరుపుల రాజా
సోసైటీల్లో అక్రమాలకు పాల్పడ్డారని పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి వరుపుల రాజా తనను అరెస్టు చేయడానికి వచ్చిన సీఐడీ అధికారుల నుండి తప్పించుకున్నారు. గతంలో డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బినామీ రుణాలు మంజూరు చేశారని.. అంతేకాకుండా లంపకలోవ, గండేపల్లి సొసైటీల్లో… కోట్లకు అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై పలు ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. వరుపులకు నోటీసులు ఇచ్చిన సి.ఐ.డి అధికారులు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ విషయం తెలుసుకున్న రాజా అధికారులు రావడానికి ముందే ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకున్నాయి. టీడీపీ నేతలు జ్యోతుల నెహ్రూ, వర్మ, కొండబాబు,పెందుర్తి వెంకటేష్, యనమల కృష్ణుడు, జ్యోతుల నవీన్ తదితరులు వరుపుల నివాసానికి చేరుకున్నారు.
కోర్టు వద్దని ఆదేశించినా… అరెస్టు చేయడానికి ఎందుకు వచ్చారని జ్యోతుల నెహ్రూ సీఐడీ అధికారులను ప్రశ్నించారు. తరువాత సీఐడీ అధికారులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో అది సాధ్యం కాలేదు. ఆ తరువాత కరెంటు పోవటంతో రాజా కుటుంబ సభ్యులు 9 గంటల ప్రాంతంలో తలుపులు తీశారు. సీఐడీ అధికారులు ఇంట్లోకి వెళ్లి చూడగా.. రాజా కనిపంచకపోవటంతో అక్కడి నుంచి వారు వెనుదిరిగారు. కరెంటు పోయినప్పడు సమయంలో రాజా నివాసం నుంచి తప్పించుకున్న అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో రాజా అదే రోజు రాత్రి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం, పోలీసులు, సీఐడీ తనపై కక్ష కట్టిందన్నారు. అందుకే కోర్టు అరెస్టు చేయొద్దు..అని ఇచ్చిన ఆదేశాలను కూడా మరచి అన్యాయంగా తనను గత రెండు నెలలుగా వేధిస్తున్నారని.. వీడియోలో ఆవేదనను వ్యక్తం చేశారు.