రన్యారావు కేసులో ఈడీ ఎంట్రీ..పలు ఇళ్లపై సోదాలు
దుబాయి నుండి బంగారు కడ్డీలు అక్రమ రవాణా కేసులో ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడిన కన్నడనటి రన్యారావు కేసులో ఈడీ కూడా రంగప్రవేశం చేసింది. ఈ స్మగ్లింగ్ దందా, మనీలాండరింగ్ దేశవ్యాప్తంగా ఉండవచ్చనే ఆనుమానంతో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ బెంగళూరులోని ల్యావెల్లి రోడ్డులోని రన్యారావు నివాసంతో పాటు కోరమంగళ, జయనగర, బసవనగుడి వంటి ప్రదేశాలలోని ఆమె స్నేహితులు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ఆమెకు విదేశాలకు టికెట్లు ఎవరు బుక్ చేశారు? అనే కోణంలో కేసును పరిశీలిస్తున్నారు. ఈ బంగారం దందా చాలా పెద్ద స్థాయిలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో డీఆర్‌ఐ అధికారులే కాక సీబీఐ కూడా రంగంలోకి దిగింది. తాజాగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఆమె వెనుక రాజకీయనాయకులు, స్వామీజీలు, ఉన్నతాధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి నల్లధనాన్ని దుబాయికి తీసుకెళ్లి, అక్కడ నుండి బంగారం రూపంలో స్మగ్లింగ్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు.

