మీ పాపకు ‘ప్రిన్సెస్ సిండ్రోమ్’ ఉందా? చెక్ చేయండిలా?
ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబవుతున్న తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఎక్కువే. ఏదో ఒక కారణంతో ఒక బిడ్డతోనే సరిపెట్టేస్తున్నారు నేటి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఆడపిల్ల అయితే ఇంక యువరాణిలా చూసుకుంటున్నారు. అయితే గారాబం ఎక్కువయితే చిక్కులు తప్పవంటున్నారు నిపుణులు. దీనిని ప్రిన్సెస్ సిండ్రోమ్ అంటున్నారు. అమ్మాయిని అరచేతుల్లో పెంచాలన్న ఆశ తల్లిదండ్రులది. దీంతో చిన్నదానికీ పొగుడుతూ, కాలు కందకుండా చూసుకుంటున్నారు. వాళ్లలోకమూ మొత్తం చిన్నారి చుట్టే తిరుగుతూంటుంది. కాబట్టి తమ ప్రిన్సెస్ ఏం చేసినా మురిసిపోతారు. అయితే ఇది ఇంటివరకే పరిమితం కావడం లేదు. బయటా, స్నేహితుల దగ్గర కూడా వారు ఇలాంటి పొగడ్తలే కోరుకుంటున్నారట. ప్రతిదానికీ ఎవరో ఒకరిపై ఆధారపడుతున్నారట. ‘ప్రిన్సెస్ సిండ్రోమ్’. వినడానికి చిన్నగా ఉన్నా… వారిలో స్వతంత్ర భావాలు కొరవడుతున్నాయి. చిన్న సమస్యని కూడా సొంతంగా పరిష్కరించుకోలేక పోతున్నారు. వైఫల్యాల్నీ తట్టుకోలేకపోతున్నారు. పొగడ్తల్లో పడి మంచీ చెడూ, తప్పొప్పులనూ గుర్తించలేకపోతున్నారు. ఇ బాధ్యతలు, బంధాలను నిలుపుకోవడం సంగతైతే సరేసరి. తాము అనుకున్నట్లుగా జరగకపోతే పట్టలేని కోపం, అవమానంగా భావించడం… చేజిక్కించుకోవడానికి ఎంతకైనా తెగించడం చేస్తున్నారట. ఇలాంటి ప్రవర్తన ఎవరు తట్టుకోగలరు? స్నేహం చేయగలరు? అందుకే వాళ్లకి నిజమైన స్నేహితులే లేకుండా పోతున్నారట. మీ చిన్నారి ఇలాంటి సిండ్రోమ్‌కి గురి కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులే శ్రద్ధ తీసుకోవాలి. ఎంత ప్రేమ ఉన్నా హద్దులు మీరకుండా అదుపు చేసుకోవాలి. ముద్దు చేయడం తప్పుకాదు… కానీ తను కోరుకునే ప్రతివస్తువూ రావడం వెనక ఎవరెవరి కష్టముందో తెలియజెప్పండి. ఏదైనా సమస్యా? దగ్గరుండి పరిష్కరించొద్దు. సవాళ్లను ఎదుర్కోనీయండి. తప్పు చేస్తే మొహమాటం లేకుండా చెప్పండి. ఆటలో గెలుపోటములు ఉంటాయి. బంధాల్లో కాదు. అందరికోసం తన తల వంచాలని చెప్పక్కర్లేదు. కానీ ఎక్కడ తగ్గాలో నేర్పాలి. అప్పుడే అసలైన స్నేహితులు, బంధువులు తనకు దొరుకుతారు. కెరియర్, ఆర్థిక వ్యవహారాలు, స్నేహితులను ఏర్పరచుకోవడం వంటివాటిల్లో స్వీయ నిర్ణయాలు తీసుకోనివ్వండి.. ఇవన్నీ పాఠాలు. తనే నేర్చుకోవాలి. మీరు కావాల్సిన మార్గనిర్దేశం చేయండి. అంతేకానీ తనెలా ప్రవర్తించినా తలొగ్గొద్దు. అన్ని వేళలా వేలు పట్టుకుని నడిపించొద్దు. ఇలా చేస్తే పెరిగే కొద్దీ చక్కటి వ్యక్తిత్వంతో మీ ఇంటి మహాలక్ష్మి మంచి పేరు తెచ్చుకుంటుంది.

